Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో, ‘పొన్నియిన్ సెల్వన్’ ఫేమ్ జయం రవి తాజాగా చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధంలో వచ్చిన ఒడిదొడుకులపై ఆయన మొదటిసారి బహిరంగంగా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన అభిమానులను, ప్రేక్షకులను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ఆయన తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. “నా జీవితంలో సగానికి పైగా భాగం నేను సినిమా పరిశ్రమలోనే గడిపాను. అయితే నా జీవితంలో ఒకే ఒక్క పశ్చాత్తాపం మిగిలిపోయింది. నేను తీసుకున్న ఒక వ్యక్తిగత నిర్ణయం (భార్య ఆర్తితో విడాకులు) నా కుటుంబంతో పాటు, నన్ను ప్రాణంగా ప్రేమించే అభిమానులందరినీ ఎంతగానో బాధించింది” అని జయం రవి ఆవేదన వ్యక్తం చేశారు.
అభిమానుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ ఆయన మరింత ఎమోషనల్ అయ్యారు. “మీ అందరి ముందు నేను మోకాళ్లపై నిలబడి అడుగుతున్నాను.. దయచేసి నన్ను క్షమించండి. నా వల్ల ఎవరి మనసైనా నొచ్చుకుంటే పెద్ద మనసుతో మన్నించండి. మీ అందరికీ ఒకే ఒక్క మాట ఇస్తున్నాను.. ఇకపై ఏ విషయంలోనూ మిమ్మల్ని బాధించను, నమ్మకద్రోహం చేయను” అంటూ ఎమోషనల్ అయ్యారు. గతాన్ని మర్చిపోయి సరికొత్తగా కెరీర్‌ను ప్రారంభించబోతున్నట్లు జయం రవి స్పష్టం చేశారు. “నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. మీ అందరి గుండెల్లో నిలిచిపోయిన సంతోష్ (సంతోష్ సుబ్రమణ్యం), కుమరన్ (ఎమ్.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి), ధ్రువన్ (పేరన్మై), తాండవన్/మిథ్రన్ (తని ఒరువన్), అరుల్మొళి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్), కరాటే బాబుగా.. మీ జయం రవిగా మరింత పవర్‌ఫుల్‌గా, స్ట్రాంగ్‌గా మీ ముందుకు తిరిగి వస్తున్నాను” అని చెప్పుకొచ్చారు. ఇటీవల తన భార్య ఆర్తితో విడాకుల ప్రకటన తర్వాత తీవ్రమైన విమర్శలు, మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న జయం రవి.. ఇప్పుడు వాటన్నింటినీ దాటుకుని, తప్పులను సరిదిద్దుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవడంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ రవి అన్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

