Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే

Naga Chaitanya

Naga Chaitanya

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ENE Repeat) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.50 కోట్ల మార్కును తాకేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో ‘కౌశిక్’ పాత్రతో మరోసారి థియేటర్లను నవ్వులతో ముంచెత్తిన అభినవ్ గోమటం తనదైన శైలిలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమాకు అసలైన మార్కెట్ మేము కాదు.. మీరే (ప్రేక్షకులు). సినిమా రిలీజైన ఐదు రోజుల్లోనే రెండు, మూడు సార్లు చూశామంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. థియేటర్లలో మీ అరుపులు, విజిల్స్ చూస్తుంటే ఆనందంతో మాటలు రావడం లేదు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు 100 శాతం పార్టీ ఇస్తా.. ఇలాంటి సమయంలో తాగకపోతే ఇంకా తాగి వేస్ట్” అంటూ అభినవ్ తనదైన కామెడీ టైమింగ్‌తో స్టేజ్‌పై నవ్వులు పూయించారు. రాజమండ్రి, విజయవాడ, కాకినాడ టూర్లలో ప్రతి షో హౌస్‌ఫుల్ కావడం ఆనందంగా ఉందని, ప్రేక్షకులు రీ-రిలీజ్‌లలో చేసిన హంగామా వల్లే ఈ సీక్వెల్ సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

తన కెరీర్ తొలినాళ్లలో పడ్డ కష్టాలను గుర్తు చేసుకుంటూ అభినవ్ ఒకింత ఎమోషనల్ అయ్యారు. “ఒకప్పుడు నేను ‘డెల్’ కంపెనీలో నెలకు రూ.30 వేల జీతానికి పనిచేసేవాడిని. సినిమాల మీద పిచ్చితో ఆ ఉద్యోగం వదిలేశాక, నా సంపాదన ఏడాదికి రూ.30 వేలకు పడిపోయింది. ఎన్నో ఆడిషన్లు ఇచ్చా, థియేటర్ ఆర్ట్స్‌లో కష్టపడ్డా. కొందరు దర్శకులు ‘చేద్దాం, చూద్దాం’ అంటూనే పక్కన పెట్టేవారు. మనల్ని కిందికి లాగేవాళ్లు, తిట్టేవాళ్లు ఎందరో ఉంటారు. కానీ ఆ కష్టాలన్నీ దాటుకుని ఈ స్థాయికి వచ్చినందుకు నాకు నేను థ్యాంక్స్ చెప్పుకోవడంలో నాకు ఏమాత్రం సిగ్గు లేదు” అని అభినవ్ కుండబద్దలు కొట్టారు. ఈ సినిమాలో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు నందిని రెడ్డి, అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా, సుజీత్ క్యామియో రోల్స్ చేయడం విశేషం. ముఖ్యంగా ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి అభినవ్ మాట్లాడుతూ.. “సందీప్ రెడ్డి వంగా అన్న గురించి బయట మీరు ఏమేమి వింటారో నాకు తెలియదు కానీ, వ్యక్తిగతంగా ఆయన చాలా కూల్. సెట్‌లో ఆయనతో పనిచేయడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. నటన కూడా అదరగొట్టారు” అంటూ సందీప్‌పై వచ్చే నెగెటివ్ ప్రచారాలకు తన మాటలతో చెక్ పెట్టారు.