హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో డేటింగ్, డివోర్స్ అంటే పెద్ద విషయమేం కాదు. చాలామంది సెలెబ్రిటీ లవ్ బర్డ్స్ డేటింగ్ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఆ తరువాత విడిపోవడం కామన్. మరికొంతమంది తమ వివాహ బంధానికి విడాకులతో స్వస్తి పలుకుతున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ కపుల్ కూడా డివోర్స్ ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఎప్పుడూ అన్యోన్యంగా చూడముచ్చటగా కనిపించే అమీర్ ఖాన్, ఆయన సతీమణి కిరణ్ రావుతో విడాకులు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ జంటకు వివాహం జరిగి 15 సంవత్సరాలు అయింది. ఈ దంపతులకు ఒక కుమారుడు ఆజాద్ రావు ఖాన్ ఉన్నారు. “15 సంవత్సరాల ఈ అందమైన కాలంలో ఎన్నో అనుభవాలు, మధుర జ్ఞాపకాలు… మా సంబంధం నమ్మకం, గౌరవం, ప్రేమతో పెరిగింది. ఇప్పుడు మేము మా జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలనుకుంటున్నాము. ఇకపై భార్యాభర్తలుగా కాకుండా ఒక కుటుంబంగా ఒకరికొకరు సహకరించుకోవాలని అనుకుంటున్నాము. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నాము. విడిగా ఉంటూనే మా కొడుకు ఆజాద్ ను ప్రేమగా చూసుకుంటాము. సినిమాలు, పానీ ఫౌండేషన్, ఇతర ప్రాజెక్టులపై ఇలా అన్ని విషయాల్లో కలిసి పని చేస్తూనే ఉంటాము. ఈ విషయంలో మాకు అవగాహన కలిగించిన పెద్దలకు, శ్రేయోభిలాషులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. మాలాంటి వారు విడాకులను ముగింపుగా కాకుండా కొత్త ప్రయాణం ప్రారంభంగా చూస్తారని ఆశిస్తున్నాము” అంటూ ఓ సుదీర్ఘ ప్రకటనను ఇచ్చారు.
Read Also : ప్రెగ్నెన్సీ రూమర్స్ పై చిన్మయి రియాక్షన్
ఇక అమీర్ ముందు రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన 16 సంవత్సరాల తరువాత 2002లో ఆమెతో విడాకులు తీసుకున్నాడు. రీనా దత్తా, అమీర్ కు ఒక కుమార్తె ఇరా, కుమారుడు జునైద్ ఉన్నారు. ఆ తరువాత ఆప్టిక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న కిరణ్ రావును “లగాన్” మూవీ సెట్స్‌లో కలిశారు అమీర్ ఖాన్. ఆ తరువాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి వైపు మొగ్గు చూపారు. వారు డిసెంబర్ 28, 2005న పెళ్లిబంధంలోకి అడుగు పెట్టారు. ఇద్దరూ తమ మొదటి కుమారుడు ఆజాద్ రావు ఖాన్‌ను 2011లో సర్రోగసీ ద్వారా స్వాగతించారు. బిటౌన్ లో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్న ఈ జంట ఎవ్వరూ ఊహించని విధంగా చేసిన ప్రకటనకు బిత్తరపోవడం సినీ ప్రేక్షకుల వంతైంది.
కాగా అమీర్ ఖాన్ ప్రస్తుతం తన చిత్రం “లాల్ సింగ్ చద్దా” విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది అవార్డు గెలుచుకున్న టామ్ హాంక్స్ చిత్రం “ఫారెస్ట్ గంప్” అధికారిక హిందీ రీమేక్. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు.