Aakasamlo Oka Tara: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్‌లో, డైరెక్టర్ పవన్ సాధినేని తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ ఈ శుక్రవారం (నవంబర్ 20న) పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించిన ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డైరెక్టర్ పవన్ సాధినేని, అసలు ఈ సినిమా కథ పుట్టడానికి కారణమైన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.
అసలు ‘ఆకాశంలో ఒక తార’ ఆలోచన ఎలా వచ్చిందో పవన్ సాధినేని వివరించారు. కరోనా సమయంలో తాను వ్యోమగామి కల్పనా చావ్లా బయోగ్రఫీ చదువుతున్నప్పుడు ఒక విషయం తనను బాగా కదిలించిందని చెప్పారు. “కల్పనా చావ్లా జర్నీ కంటే, ఆమె కలలను నిజం చేయడం కోసం ఆమె భర్త చూపించిన ప్రేమ, అందించిన సపోర్ట్ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ పుస్తకం చదివాకే ఈ కథకు బీజం పడింది” అని తెలిపారు. ఒక అమ్మాయి తన కలను సాధించుకోవడానికి చేసే ప్రయాణంలో ‘కృష్ణ’ అనే పాత్ర ఎలా తోడుగా నిలిచిందనేదే ఈ సినిమా అని, ఆ కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ 100 శాతం ఒదిగిపోయారని అన్నారు.
ఈ కథను తెరపైకి తీసుకురావడానికి టీమ్ అంతా ఎంతో కష్టపడిందని పవన్ సాధినేని వెల్లడించారు. అంతరిక్షానికి సంబంధించిన అంశాలు, టెక్నికల్ పదజాలంపై పూర్తి అవగాహన కోసం శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లతో కలిసి రెండేళ్ల పాటు రీసెర్చ్ చేశామని చెప్పారు. అలాగే ఏడాదిన్నర పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన తర్వాతే షూటింగ్ మొదలుపెట్టినట్లు వివరించారు. ఇంతటి బలమైన కథ కావడంతోనే అల్లు అరవింద్, స్వప్న దత్, గుణ్ణం గంగరాజు వంటి నిర్మాతలు కథ విన్న వెంటనే ఒక్క మార్పు కూడా చెప్పకుండా ఓకే చేశారని తెలిపారు.
ఇదే క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్నకు కూడా పవన్ సాధినేని స్పందించారు. తన మొదటి సినిమా చూసి అభినందించిన ఫస్ట్ స్టార్ హీరో అల్లు అర్జున్ అని గుర్తుచేసుకున్నారు. తాను రాసుకున్న చాలా కథలను బన్నీకి చెబుతుంటానని, ఆయన కూడా తన దగ్గరున్న కథలు వినిపిస్తుంటారని చెప్పారు. అయితే, అంత పెద్ద స్టార్‌ను హ్యాండిల్ చేయగలనని తనకు పూర్తి నమ్మకం కుదిరిన రోజు కచ్చితంగా అల్లు అర్జున్‌తో సినిమా చేస్తానని పవన్ సాధినేని క్లారిటీ ఇచ్చారు.

