ప్రస్తుతం సామాన్యుడిని, ముఖ్యంగా నెల జీతం మీద బతికే మధ్యతరగతి ప్రజలను నిద్రలేకుండా చేస్తున్న అతిపెద్ద భూతం ‘లోన్ యాప్స్’. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. అప్పుల ఊబిలోకి లాగి, వేధింపులతో ప్రాణాలు తీస్తున్న ఈ డిజిటల్ మాఫియా నేపథ్యంలో ఓ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతోంది. అదే ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ‘ఈగో రాజా’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఆది కోలీవుడ్లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. టీజర్ చూస్తుంటేనే ఇదొక బర్నింగ్ ఇష్యూ మీద తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా అని అర్థమైపోతోంది. “ఈ ప్రపంచమే డబ్బు వెనక పడుతోంది.. కానీ వాడు మాత్రం అలాంటి వారిలో ఒకడు కాదు.. అతనే డిజిటల్ డెవిల్” అంటూ విలన్ నడిపే ఇల్లీగల్ సామ్రాజ్యాన్ని పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది.
ముఖ్యంగా “స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడూ ఆ యాప్‌లో అప్పు తీసుకునేలా చేస్తా.. నా టార్గెట్ మంత్లీ సాలరీ తీసుకునే మిడిల్ క్లాస్ కామన్ మెన్.. వాళ్లను కంట్రోల్ చేయడానికి నాకు ఓ ఊర మాస్ గాడు కావాలి” అంటూ విలన్ చెప్పే డైలాగ్స్ ప్రస్తుత సమాజంలోని చేదు నిజాన్ని కళ్లకు కట్టాయి. సరిగ్గా అదే సమయంలో ఆది సాయికుమార్ తన ఊరమాస్ ఎంట్రీతో అదరగొట్టాడు. లోన్ యాప్స్ వేధింపులు, ఆత్మహత్యల నేపథ్యంలో హీరో పాత్ర ఎలాంటి మలుపు తిరుగుతుంది? అతనిలో మార్పుకు కారణమయ్యే ఎమోషనల్ పరిస్థితులు ఏంటి? అన్నది సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. టాప్ టెక్నీషియన్స్.. ఆది మాస్ లుక్ అదుర్స్! ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ‘ఈగో రాజా’, ఈ టీజర్‌తో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆది సాయికుమార్ పవర్ఫుల్ మాస్ లుక్, సగటు మధ్యతరగతి మనిషిగా కోలీవుడ్ నటుడు సతీష్ నటన, శరణ్య రామచంద్రన్ గ్లామర్ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఆద్య ప్రసాద్ మరో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక టెక్నికల్‌గానూ ఈ సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస విజువల్స్, ఘిబ్రాన్ వైభోద అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (ఆర్ఆర్) టీజర్‌కు ప్రాణం పోశాయి. ఎస్జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గురు శరవణన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. మేఘనాథన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ‘డిజిటల్ డెవిల్’ ఆట కట్టించడానికి వస్తున్న ఈ ‘ఈగో రాజా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మాస్ జాతర చేస్తాడో చూడాలి!

