(జూన్ 20తో ‘గడసరి అత్త -సొగసరి కోడలు’కు 40 ఏళ్ళు)
బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతీ రామకృష్ణ ‘గడసరి అత్త’గా, శ్రీదేవి ‘సొగసరి కోడలు’గా నటించిన చిత్రంలో కృష్ణ కథానాయకుడు. అంతకు ముందు కృష్ణతో ‘వియ్యాలవారి కయ్యాలు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన కట్టా సుబ్బారావు ఈ ‘గడసరి అత్త-సొగసరి కోడలు’ రూపొందించారు. 1981 జూన్ 20న విడుదలైన ఈ చిత్రం జనాన్ని బాగానే ఆకట్టుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే – భర్తను బలవంతపెట్టి, ఆస్తి మొత్తం తనపేర రాయించుకున్న భానుమతికి ఇద్దరు కొడుకులు హరనాథ్, కృష్ణ. ఇక ఆమెకు తమ్ముని వరస అయ్యే రావు గోపాలరావు కూతురు శ్రీదేవి. అతను కాంచనను పెళ్ళాడి వదిలేసి, బిడ్డను తనతోనే ఉంచుకొని పెంచి పెద్ద చేసి ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ తన మేనమామకు, అమ్మకు బుద్ధి చెప్పి అందరి కళ్ళు తెరిపిస్తాడు. పరాయి పురుషులను చూస్తేనే నేరం అన్నట్టుగా ఉండే పాత్రలో శ్రీదేవి భలేగా ఆకట్టుకుంది. ఇక తనదైన మార్కు అభినయంతో భానుమతి అత్తగా అలరించారు.
ఇందులో భానుమతి భర్త పాత్రలో నాగభూషణం కనిపించారు. రమాప్రభ, వరలక్ష్మి, మమత, శకుంతల, పి.ఎల్.నారాయణ, రాజబాబు, కాకరాల, జె.వి.రమణమూర్తి ఇతర పాత్రల్లో అభినయించారు. పినిశెట్టి రాసిన కథకు, ఆయనతో పాటు కాశీవిశ్వనాథ్ కూడా కలసి మాటలు రాశారు. వేటూరి పాటలకు సత్యం బాణీలు పలికించారు. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల వీరయ్య చౌదరి, సోమిశెట్టి సుబ్బారావు నిర్మించారు. నిర్మాతలకు ఈ సినిమా మంచి లాభాలనే తెచ్చి పెట్టింది.