అర్నాల్డ్ స్క్వార్జెనెగర్… ఇతనెవరో అందరికీ తెలిసిందే! కానీ, ఇతని గురించి తెలియని విషయాలు చాలానే ఉండేవి! మొదట బాడీ బిల్డర్ గా, తరువాత హాలీవుడ్ స్టార్ గా, ఆ తరువాత అమెరికన్ పొలిటీషన్ గా అర్నాల్డ్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. అయితే, ఆయన పర్సనల్ లైఫ్ మాత్రం ఎన్నో చీకటి కోణాలమయం. ఇప్పుడు మళ్లీ ఈ చర్చ ఎందుకూ అంటారా? అర్నాల్డ్ కి మొత్తం అయిదుగురు పిల్లలు! అందులో అందరికంటే చిన్నవాడు వెండితెర రంగప్రవేశం చేయబోతున్నాడు…
23 ఏళ్ల జోసెఫ్ బైనా త్వరలో ‘బుల్లీ హై’ అనే సినిమాలో కనిపించనున్నాడు. ఆ సినిమా బిహైండ్ ద సీన్స్ విజువల్స్ లోంచి ఓ ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అయితే, క్యాప్షన్ మాత్రం కాస్త ఫన్నీగా ఇచ్చాడు! ‘‘ప్రైవేట్ స్కూల్లో చదువుకోవటం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసింది!’’ అంటే, అతను బాల్యంలో ఫీజులు భారీగా ఉండే ప్రైవేట్ స్కూలుకి వెళ్లలేదన్నమాట. గవర్నమెంట్ నడిపే బడిలోనే చదువు పూర్తైంది. ఇప్పుడు తన తొలి ‘బుల్లీ హై’లో ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు!
జోసెఫ్ బైనా అనే కుర్రాడి గురించి ఇప్పుడు ఇంత వివరంగా మాట్లాడుకోటానికి, అతని మొదటి సినిమా గురించి చర్చ జరగటానికి కారణం… ఆయన అర్నాల్డ్ కొడుకు కావటమే! నిజానికి జోసెఫ్ 14 ఏళ్లు పూర్తి చేసుకునే దాకా అర్నాల్డ్ వారసుడని ఎవరికీ తెలియదు. చివరకు, అర్నాల్డ్ కి కూడా! అన్నేళ్లు అతని తల్లి ప్యాట్రీషియా బైనా కూడా ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. కానీ, రోజురోజుకు పెరిగి పెద్దవాడవుతోన్న జోసెఫ్ ను చూసి అందరూ క్రమంగా ఆశ్చర్యపోవటం మొదలు పెట్టారు. ఎందుకంటే, అర్నాల్డ్ స్వంత పిల్లల కంటే ఎక్కువగా జోసెఫ్ లో అతని పోలికలు కనిపించసాగాయి. చివరకు, ఆ కుర్రాఢు అర్నాల్డ్ తనయుడేనని తేలింది.
ప్యాట్రిషియా కొడుకుగా పుట్టి, పెరిగిన జోసెఫ్ 14 ఏళ్ల తరువాత ది గ్రేట్ అర్నాల్డ్ స్క్వార్జెనెగర్ వారసుడిగా ఫేమస్ అయిపోయాడు! అర్నాల్డ్ కూడా తన భార్యతో డైవోర్స్ తీసుకోవాల్సి వచ్చినప్పటికీ నిజం దాచలేదు. జోసెఫ్ తల్లి ప్యాట్రీషియా బైనాతో తనకు సంబంధం ఉండిందని ఒప్పుకున్నాడు. దాని ఫలితంగానే కొడుకు పుట్టాడని చెప్పాడు. ప్రస్తుతం జోసెఫ్, అతని తల్లీ అర్నాల్డ్ సంరక్షణలోనే మరో ఇంట్లో ఉంటున్నారు!
ఒకప్పటి సినిమాల్లోని కథని తలపించేలా సాగిన జోసెఫ్ బైనా జీవితం గురించి తెలుసుకున్న ఎవరికైనా ఒక డౌట్ రావటం సహజం? ఇంతకీ ఆయన ప్యాట్రీషియా బైనాకి, అర్నాల్డ్ కి రొమాంటిక్ రిలేషన్ ఎక్కడ సాధ్యమైంది? ఈ ప్రశ్నకి సమాధానం అర్నాల్డ్ ఇల్లే! అవును… అర్నాల్డ్ ఇంట్లో ప్యాట్రీషియా హౌజ్ కీపర్ గా 20 ఏళ్లు పని చేసింది! అదీ అసలు ట్విస్ట్! చూడాలి మరి… హాలీవుడ్ కండల వీరుడు నడిపిన ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’ స్టోరీ కారణంగా పుట్టిన జోసెఫ్… హాలీవుడ్ లో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో!