నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రంలోని తెలంగాణ ఫోక్ సాంగ్ ‘సారంగదరియా’కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సాంగ్ లిరిక్స్ కు, మ్యూజిక్ కు, మంగ్లీ వాయిస్ కు, అందులో సాయి పల్లవి డాన్స్ కు, హావభావాలకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ‘సారంగదరియా’ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ దాటింది. సౌత్ లో ఒక పాటకు ఇంతటి ఆదరణ రావడం విశేషం. గతంలో కూడా సాయి పల్లవి, ధనుష్ జంటగా నటించిన ‘మారి’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ 800 మిలియన్ల వ్యూస్ దాటేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ చిత్రంలోని ‘వచ్చిండే’ సాంగ్ 200 మిలియన్ల వ్యూస్ దాటింది. ప్రస్తుతం ఈ సాంగ్ 300 మిలియన్ వ్యూస్ దాటడానికి అతి చేరువలో ఉంది. కాగా ఇందులో ‘వచ్చిండే, సారంగదరియా’ సాంగ్స్ రెండూ సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందినవే. తాజాగా ‘సారంగదరియా’ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ దాటేయడంతో సాయి పల్లవి ఖాతాలోకి మరో కొత్త రికార్డు చేరింది. సౌత్ లోనూ, సాయి పల్లవి కెరీర్లోనూ ‘సారంగదరియా’ సాంగ్ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుంది. ఇక ‘లవ్ స్టోరీ’ సినిమాను తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎల్ఎల్పి , అమిగో క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కావాల్సి ఉంది. కానీ దేశంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. సినిమా కొత్త విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.