నేడు ప్రముఖ దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుక జరగనుంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో కలిసి ఆమె మరికొద్దిగంటల్లోనే ఏడడుగులు వేయనుంది. కొవిడ్ నేపథ్యంలో కుటుంబసభ్యులు, అతి తక్కువ మంది ఆప్తుల సమక్షంలో మహాబలిపురంలో వీరి వివాహం జరగనుంది. కాగా, బంధు-మిత్రులతో శంకర్ ఇంట సందడి సందడిగా కనిపిస్తోంది. రోహిత్ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఆయన తండ్రి దామోదరన్ చెన్నైలో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా రాణిస్తున్నాడు. మదురై పాంతర్స్ క్రికెట్ టీమ్‌కి ఆయన యజమానిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు. ప్రస్తుతం శంకర్ సినిమాల విషయానికి వస్తే.. కమల్ హాసన్ తో ‘ఇండియన్-2’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఒక పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.