Jamuna: జమున పేరు వినగానే చాలామంది ఆ నాటి సినీ అభిమానులు యన్టీఆర్, ఏయన్నార్ వంటి హేమాహేమీలతో విభేదించినా, చిత్రసీమలో నిలదొక్కుకొని రాణించారు అంటూ చెబుతుంటారు. నిజానికి ఆ ఇద్దరు మహానటులతోనూ జమున ఎంతో సఖ్యంగానే ఉన్నారు. ‘ఇల్లరికం’ సినిమా సమయంలో ఏదో విషయమై ఏయన్నార్ తో ఆమె విభేదించిన మాట వాస్తవమే. ఆ తరువాత ఏయన్నార్, ఆమెతో కలసి నటించడానికి అంతగా ఇష్టపడలేదు. యన్టీఆర్ సైతం ఏయన్నార్ మాట విని, తన చిత్రాలలో జమునకు నాయికగా అవకాశాలు కల్పించలేదు. ఇలా ఓ యేడాది పాటు సాగింది. అయితే అప్పట్లో యన్టీఆర్ పలు చిత్రాలలో నటిస్తుండేవారు. అందువల్ల ముందుగా కమిట్ అయిన చిత్రాలలో జమునతో కలసి నటించారు.
ఏమైనా ఓ యేడాది పాటు 1960ల ఆరంభంలో రామారావు, నాగేశ్వరరావు చిత్రాలలో జమున కనిపించలేదు. ఈ విషయం తెలుసుకున్న విజయాధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి ఆమెను పిలిపించి, ఆ ఇద్దరు మహానటులతో సయోధ్య కుదిర్చారు. ఆ వెనువెంటనే యన్టీఆర్, జమునను తమ ‘గులేబకావళి కథ’ చిత్రంలో నాయికగా ఎంపిక చేసుకొని, తమ యన్.ఏ .టి. సంస్థ సంస్రదాయం ప్రకారం జమునకు అగ్రిమెంట్ చేయించుకొనేముందు చీరెసారె పెట్టి పుండరీకాక్షయ్యతో పంపారు. ఆమె ఆనందంగా ఆ చిత్రంలో నటించారు. యన్టీఆర్ దర్శకత్వం వహించి, నటించిన ఏకైక జానపద చిత్రం ‘గులేబకావళి కథ’ సూపర్ హిటయింది. ఆ తరువాతే యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోకలసి జమున నటించిన ‘గుండమ్మకథ’ విడుదలై విజయఢంకా మోగించింది. తరువాతి రోజుల్లోనూ జమున పలువేదికలపై ఏ మాత్రం జంకకుండా ఆ నాటి తమ విభేదాన్ని గుర్తు చేసుకొనేవారు. అయినా తానేమీ తగ్గకుండా ముందుకు సాగానని తన వ్యక్తిత్వాన్ని చాటుకొనేవారు.
యన్టీఆర్, ఏయన్నార్ నిరాకరించిన సమయంలోనే జమున, హరనాథ్ ను చేరదీసి, ఆయనను హీరోగా నిలిపిందని చెబుతూ ఉంటారు. కానీ, అందులో వాస్తవం లేదని జముననే పలుమార్లు చెప్పారు. జమున, హరనాథ్ నటించిన తొలి చిత్రం ‘మా ఇంటి మహలక్ష్మి’. ఈ సినిమా సమయానికి జమున అగ్ర కథానాయకులతో కలసి నటించారు. యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రూపొందిన ‘గుండమ్మకథ’లో జమున నాగేశ్వరరావుకు జోడీగా నటించగా, ఆమె అన్న పాత్రలో హరనాథ్ కనిపించారు. ఆ పై యన్టీఆర్ ‘నాదీ ఆడజన్మే’లో హరనాథ్ జోడీగా జమున నటించారు. ఆ తరువాత వారిద్దరూ నటించిన ‘లేతమనసులు’ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ పై జమున, హరనాథ్ జంటను కూడా ప్రేక్షకులు ఆదరించారు. అంతే తప్ప, వారిద్దరిపై కోపంతో తాను హరనాథ్ తోనే నటించానని చెప్పడంలో వాస్తవం లేదని ఆమె చెప్పేవారు.
అలాగే మరికొందరు హరనాథ్ అభివృద్ధిలోకి వస్తూంటే యన్టీఆర్, ఏయన్నారే అతనిపై జమున రూపంలో ఓ అస్త్రం ప్రయోగించారని, దాంతో ఆయన తాగుడుకు బానిసై కెరీర్ నాశనం చేసుకున్నారనీ అంటూ ఉంటారు. కానీ, అందులోనూ ఏ మాత్రం వాస్తవం లేదు. హరనాథ్, జమున సూపర్ హిట్ మూవీ ‘లేత మనసులు’ నాటికే ఆయన మందుకు అలవాటు పడ్డారు. కొన్నిసార్లు జమున సైతం ఆయనను మందలించారు. వ్యసనాలకు బానిసైతే కెరీర్ నాశనమవుతుందనీ హెచ్చరించారు. కానీ, ఆమె మాటలను సైతం పెడచెవిన పెట్టిన హరనాథ్ అనతికాలంలోనే స్టార్ డమ్ కోల్సోయారు. ఇలాంటి అవాస్తవాలు జమున చుట్టూ తిరుగుతూనే ఉండేవి అయినా, ఆమె చిరునవ్వుతోనే వాటిని అధిగమించారు. వాస్తవాలను వివరించి చెప్పి ఎంతోమంది కళ్ళు తెరిపించారు. అదే – జమున విలక్షణమైన వ్యక్తిత్వం అనిచెప్పవచ్చు.