Site icon NTV Telugu

CII – Dakshin 2022: సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ గా ఆ నలుగురు!

Dakshin 2022

Dakshin 2022

చెన్నయ్ లో శుక్ర, శనివారాల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ జోన్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మెట్ జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించిన ఈ సమ్మెట్ లో దక్షిణాదికి చెందిన అగ్ర దర్శకులతో పాటు, స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు.

విశేషం ఏమంటే… గత కొన్ని రోజులుగా ఈ సమ్మెట్ నిర్వహణ బాధ్యతలను ప్రధానంగా నలుగురు మహిళామణులు తమ భుజాలకెత్తుకుని సమన్వయంతో నిర్వహిస్తున్నారు. వారే సుహాసిని, ఖుష్బూ, లిజీ, సుజాత! ఇందులో మొదటి ముగ్గురూ ఆ మధ్య వరకూ హీరోయిన్లుగా నటించి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. సుహాసిని భర్త మణిరత్నం దర్శక నిర్మాత కాగా, ఖుష్బూ భర్త సుందర్ సి. దర్శక నిర్మాత, నటుడు కూడా! ఇక లిజీ మాజీ భర్త ప్రియదర్శన్ పాపులర్ దర్శకుడు, నిర్మాత. వీరిద్దరి కూతురు కళ్యాణీ ప్రియదర్శన్ తెలుగుతో పాటు పలు భాషల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నాలుగో వ్యక్తి సుజాత పాపులర్ టెలివిజన్ ప్రొడ్యూసర్. అలానే సినిమాలూ నిర్మించారు. ఆమె ప్రముఖ దర్శక నిర్మాత, తెనాండాల్ స్టూడియోస్ అధినేత రామ్ నారాయణ్ కోడలు. ఆయన కొడుకు మురళీని సుజాత వివాహం చేసుకున్నారు. అంతేకాదు వీరి కుమార్తె ఆర్తి… హీరో ‘జయం’ రవి భార్య!

చెన్నయ్ లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన సీఐఐ దక్షిణ్ 2022 సమ్మెట్ బాధ్యతలను తమ భుజస్కందాలపై వేసుకున్న ఈ నలుగురూ… ఈ ఈవెంట్ లో ఒకే డ్రస్ కోడ్ తో అదరగొడుతున్నారు. మొన్న లేత గోధుమ వర్ణం చీరలను ధరించిన వీరు… శుక్రవారం ఉదయం రెడ్ కలర్ శారీతోనూ… మధ్యాహ్నం నుండి బ్లాక్ కలర్ చీరతోనూ ఆహుతులను ఆకట్టుకుంటున్నారు. ‘ముదితల్ నేర్వగ రాని విద్యగలదే…’ అన్నట్టుగా నటన, చిత్ర నిర్మాణంలోనూ తమదైన ముద్రవేస్తున్న ఈ నలుగురూ… తమకు తామే సాటి అన్నట్టుగా ఈ సమ్మెట్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అందుకే అంటారు… ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అని!

Exit mobile version