Sushmita Konidela: మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మరో కీలక బాధ్యత దక్కింది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలను విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అమ్మవారి దర్శనం కోసం ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల సమయంలో ఆలయానికి భారీగా భక్తుల రద్దీ ఉంటుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక ఆలయ ట్రస్ట్ బోర్డులో సుస్మిత కొణిదెలకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా అవకాశం దక్కడం విశేషం.
సినీ రంగానికి చెందిన కుటుంబం నుంచి వచ్చిన సుస్మితకు ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. చిరంజీవి కుమార్తెగానే కాకుండా పలు ప్రాజెక్టులకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కాగా ఇటీవల కొణిదెల కుటుంబానికి చెందిన సురేఖ కొణిదెలకు కూడా తెలంగాణలోని యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డులో సభ్యురాలిగా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త బోర్డులో సురేఖ కొణిదెల పేరును సభ్యుల జాబితాలో చేర్చింది. ఇప్పుడు సుస్మిత కొణిదెలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితురాలి బాధ్యతలు అప్పగించనున్నట్లు వస్తున్న వార్తలతో కొణిదెల కుటుంబానికి ఆలయ వ్యవహారాల్లో మరో కీలక అవకాశం దక్కినట్టైంది. అయితే సుస్మితకు అప్పగించిన బాధ్యతలు, ఆమె హోదా, బోర్డులో ఆమె పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

