Chiranjeevi – Odela Movie: మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లో సినీ ప్రియులను అమితంగా ఊరించిన ప్రాజెక్టుల్లో శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ ఒకటి. ‘దసరా’, ‘ది ప్యారడైజ్’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాల తర్వాత తను ఎంతగానో ఇష్టపడే మెగాస్టార్‌ను శ్రీకాంత్ వెండి తెరపై ఎలా చూపించబోతున్నారనే దానిపై ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే, ప్రస్తుతం శరవేగంగా ముస్తాబవుతున్న ‘కాకా’ తర్వాత మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెలతో సెట్స్‌పైకి వెళ్లడం అనుమానమేనన్న గుసగుసలు ఫిలింనగర్‌లో ఊపందుకున్నాయి. ‘ది పారడైజ్’ ప్రమోషన్ల సమయంలో హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల స్వయంగా మాట్లాడుతూ.. ఈ మూవీ పూర్తయిన వెంటనే చిరంజీవి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని వెల్లడించారు. అంతా అనుకున్నట్లు జరిగితే ‘కాకా’ తర్వాత మెగాస్టార్ చేయాల్సిన నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ ఓదెల సినిమానే కావాలి. కానీ, ‘ది పారడైజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతున్నప్పటికీ ప్రేక్షకులనుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఫలితం తర్వాత మెగా కాంపౌండ్‌లో ప్రాజెక్టుల ప్రాధాన్యతా క్రమం మారిందా? అనే సందేహాలు స్టార్ట్ అయ్యాయి. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరందుకుంది.
ప్రస్తుతం చిరంజీవి బాబీ డైరెక్షన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘కాకా’. ఈ సినిమాతో పాటు మరికొన్ని కమిట్‌మెంట్లతో ప్రస్తుతం మెగాస్టార్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్‌ను బాస్ హోల్డ్‌లో పెడతారా లేక పూర్తిగా పక్కన పెడతారా అనే దానిపై స్పష్టత కొరవడింది. అయితే ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న మరో కథనం ప్రకారం.. ఈ మెగా ప్రాజెక్ట్‌ను వెంటనే రద్దు చేయకపోయినా, స్క్రిప్ట్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందట. కుదిరితే 2027 సంక్రాంతి సీజన్ దాటిన తర్వాతే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే ఆలోచనలో మెగా కాంపౌండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో మెగాస్టార్ ఇతర ప్రాజెక్టులతో ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. శ్రీకాంత్ ఓదెల రా స్టైల్‌ను చిరంజీవి ఇమేజ్‌కు సరిగ్గా సింక్ చేయగలడా అన్న ఆసక్తి ఒకవైపు ఉండగా, ‘కాకా’ రిలీజ్ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ భవితవ్యంపై పూర్తి క్లారిటీ వచ్చే వీలుందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ అంతా సర్దుకుని ఈ మెగా ప్రాజెక్ట్ పట్టాలెక్కితే ఓకే, లేదంటే ఈ కాంబో నిలిచిపోయిన ప్రాజెక్టుల జాబితాలో చేరిపోతుందా అన్న సస్పెన్స్ మాత్రం ఆడియన్స్‌లో కొనసాగుతూనే ఉంది. దీనిపై అటు మెగా కాంపౌండ్ గానీ, ఇటు డైరెక్టర్ గానీ నోరు విప్పితే తప్ప అసలు నిజం బయటకు రాదు.

