మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల అధికారిక ఫలితాల కోసం ఆదివారం రాత్రి రెండు తెలుగు రాష్ట్రాలలోని జనం టీవీలకు అతుక్కుపోయిన సమయంలో ఊహించని విధంగా బ్రేకింగ్ న్యూస్ రావడం మొదలైంది. ‘మా’ ఎన్నికల ఫలితాలపై చిరంజీవి స్పందించారన్నది దాని సారాంశం. ‘మా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఓ పక్క జరుగుతున్న సమయంలోనే ‘పెళ్ళిసందడి’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అప్పటికే ‘మా’ ఫలితాల సరళి చిరంజీవికి చేరడం జరిగింది. దాంతో ఆ వేదిక మీదనే ఆయన స్పందించారు. రెండు, మూడేళ్ళ పోస్ట్ కోసం ఒకరిని ఒకరు ఇన్ని మాటలు అనుకోవడం, ‘మా’ పరువు తీయడం ఎంత వరకూ సమంజసం? అంటూ చిరంజీవి సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని, చిన్న చిన్న పదవుల కోసం ఇగోలు వద్దని, వివాదాలు పుట్టించే వ్యక్తులను దూరంగా ఉంచాలని కోరారు. అంతేకాదు… మనదంతా వసుదైక కుటుంబం అని చాటిచెప్పారు.
Read Also : మీడియాపై యాంకర్ ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు
అంతా బాగానే ఉంది కానీ చిరంజీవి కళ్ళ ముందే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో రెండు వర్గాలు పోటీ పడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న కొందరు వేస్తున్నారు. దాసరి నారాయణ రావు తర్వాత ఆ స్థానంలో చిరంజీవిని చూడాలని కొందరు అనుకుంటున్న నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి పెద్దనయ్య పాత్ర ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నారు. ఇరు పక్షాలను కూర్చోపెట్టి, వారి మధ్య సామరస్యత కోసం కృషి చేసి, ఏకగ్రీవంగా ‘మా’ కార్యవర్గాన్ని చిరంజీవి ఏర్పాటు చేసి ఉంటే… ఈ రోజు ఇంత గొడవ జరిగేది కాదని, ‘మా’ పరువు బజారులో పడేది కాదని చెబుతున్నారు. ఆ రోజున వ్యూహాత్మకంగా మౌనం పాటించిన చిరంజీవి, ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత ఇలా మాట్లాడే బదులు ముందే చొరవ చూపి ఉంటే బాగుండేదన్నది వారి భావన. మరి రాబోయే రోజుల్లో అయినా చిరంజీవి ‘పెద్దన్నయ్య’గా అందరినీ కలుపుకుని, అందరి మాటలను గౌరవిస్తూ ముందుకు వెళతారేమో చూడాలి!