పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తొలుత అభిమానుల్లో జోష్ నింపేశారు. తానొచ్చింది యూనిట్ కోసం కాదని, మీకోసమేనంటూ అభిమానుల్ని ఉద్దేశంచి చెప్పగానే.. ఆ వేదిక ఒక్కసారిగా ఫ్యాన్స్ కేరింతలతో హోరెత్తిపోయింది. ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లందరూ తన కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లేనని, వాళ్ల కోసం తను తప్పకుండా రావాల్సిందేనని నిర్ణయించుకొని ఈ ఈవెంట్ కి వచ్చానన్నారు. అయితే.. ఈ ఈవెంట్ కి వచ్చి, మిమ్మల్ని (ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ) చూశాక నాకెంతో సంతోషం కలిగిందన్నారు.
ఇదే సమయంలో గోపీచంద్ తండ్రి, దర్శకుడు టీ. కృష్ణతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తామిద్దరం ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నామని, సీనియర్ అయిన ఆయన తమకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చారన్నారు. ఇక గోపీచంద్ గురించి మాట్లాడుతూ.. గోపీచంద్ చాలా మంచి నటుడని, కత్తిలాంటి ఆహార్యానికి తగ్గట్టే పాత్రలకు ప్రాణం పోస్తాడని, అతడు చేసిన సినిమాల్లో తనకు సాహసం, ఒక్కడున్నాడు, చాణక్య చాలా బాగా నచ్చాయన్నారు. అతడు కచ్ఛితంగా ఉన్నత స్థానాలకు వెళ్తాడని ఆశించారు. ఇదే సమయంలో దర్శకుడు మారుతితో ప్రజారాజ్యం పార్టీ ఫ్లాగ్ డిజైన్ దగ్గర నుంచే మంచి అనుబంధం ఉందని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే నీలో దర్శకుడు ఉన్నాడని చెప్పానని, ఇప్పుడు దర్శకుడిగా సక్సెస్ ఫుల్ గా రాణిస్తుండడం చూసి ఆనందంగా ఉందన్నారు.
పక్కా కమర్షియల్ ట్రైలర్ చూస్తుంటే.. ఇందులో అన్నీ హంగులున్నట్టు కనిపిస్తున్నాయని, ఇది కచ్ఛితంగా గత సినిమాల కంటే మంచి విజయాన్ని సాధిస్తుందని మారుతికి చిరు భరోసానిచ్చారు. ఇది కచ్ఛితంగా మంచి విజయం సాధిస్తుందన్నారు. ఈ క్రమంలోనే మారుతి దర్శకత్వంలో తాను ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ యువీ క్రియేషన్స్ విక్కీతో చూడాలని కూడా అన్నారు. అంటే.. ప్రభాస్ తర్వాత మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే బంపరాఫర్ ని మారుతి కొట్టేశాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ.. చిరు తన ప్రసంగాన్ని ముగించారు.