Site icon NTV Telugu

చిరు, విజయ్ ట్వీట్స్‌… తెలంగాణకు మోదం… ఏపీకి ఖేదం

Chiranjeevi-and-vijay-devar

మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ శనివారం చేసిన ట్వీట్స్ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. వీరు తమ తమ ట్వీట్స్ తో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అటు ఎపి గవర్నమెంట్ కు సందేశాలను పంపగలిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో పెద్ద రగడ జరుగుతోంది. జీవో 35ను అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తే… కొంత మంది ఎగ్జిబిటర్స్ కోర్టుకు వెళ్ళి సింగిల్ జడ్జ్ తీర్పుతో దానిపై స్టే తీసుకు వచ్చారు. అయితే ప్రభుత్వం మళ్ళీ అప్పీలుకు వెళ్ళింది. ప్రస్తుతం కేసు హై కోర్టులో నడుస్తోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో పలు థియేటర్లలో ప్రభుత్వ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

సినిమాటోగ్రఫీ యాక్ట్ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయో లేదో చెక్ చేస్తూ అలా లేని థియేటర్లను సీజ్ చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల నిబంధనలు పాటించకుండా, రెన్యువల్ లేకుండా థియేటర్లను నడిపేవారు స్వచ్ఛందంగా మూసి వేస్తున్నారు కూడా.

https://ntvtelugu.com/chiranjeevi-says-thanks-to-kcr-on-ts-ticket-rates-new-go/

ఇది మన చిత్రపరిశ్రమలో చాలా మందికి కంటగింపుగా మారింది. అటు ప్రభుత్వాన్ని విమర్శించలేక సినిమా బడ్జెట్ ను కంట్రోల్ చేయలేక సతమతమవుతున్నారు. ఏపీ మంత్రులు ఏకంగా హీరోలు, సాంకేతిక నిపుణులు పారితోషికాలను ఎందుకు తగ్గించుకోరంటూ ప్రశ్నిస్తున్నారు కూడా. కరోనా ముందు కంటే తర్వాత పారితోషికాలను భారీగా పెంచిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం సినిమావారిపై వరాలజల్లు కురిపిస్తోంది. టికెట్ ధరలను పెంచుకోవచ్చని సెలవిచ్చింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణా హీరో విజయ్ దేవరకొండ తమ తమ ట్వీట్స్ లో తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.

‘తెలుగు చిత్ర పరిశ్రమ కోరికను మన్నించి నిర్మాతలు, పంపిణీదారులు, చిత్ర ప్రదర్శనదారులు అందరికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ ధరలను సమర్థించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. థియేటర్ల మనుగడకు, వేలాది కార్మికులకు మేలు చేసే నిర్ణయం ఇది. సినిమా వారి సమస్యలను అర్థం చేసుకున్న ఛీప్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, చొరవ తీసుకున్న ఎంపి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

https://ntvtelugu.com/vijay-devarakonda-tweet-on-new-movie-ticket-rates-in-ts/

ఇక విజయ్ దేవరకొండ సైతం ‘తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఆరోగ్యకరమైన అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, తలసాని తెలుగు చలన చిత్రపరిశ్రమను పరిశ్రమగా మార్చాలని కృషి చేస్తున్నారు. నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్స్ ఇన్ డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా కూడా ఉన్నాయనే వారు లేక పోలేదు. నిజానికి చిరంజీవి తెలుగు సినిమా మనుగడ కోసం ఏపీలో సినిమా టికెట్ ధరలను పెంచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కి విజ్ఞప్తి చేసి ఉన్నారు.

అయితే విజయ్ మాత్రం ఈ విషయమై ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్ధన చేయలేదు. రెండు రాష్ట్రాల ప్రేక్షకుల ఆదరణతోనే విజయ్ ఇంతవాడయ్యాడని, ఈ రోజున మా రాష్ర్టం అంటూ వేరు చేసి మాట్లాడినట్లు విజయ్ ట్వీట్ ఉందంటున్నారు. రాజగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదనే అర్థం వచ్చినట్లుగానే సినిమా వారి ట్వీట్స్ ఉంటున్నాయనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఇక నైనా సినిమా తారలు రాష్ట్రాలను వేరు చేసి మాట్లాడకుండా తెలుగువారంతా ఒక్కటే అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే బాగుంటుందంటున్నారు.

Exit mobile version