Megastar Chiranjeevi Fulfilled His Fan Nagaraju Last Wish: ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు.. తనకు సాధ్యమైనంతవరకూ సహాయం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొస్తారు. కరోనా సమయంలో ఇండస్ట్రీని ఎలా ఆదుకున్నారో అందరికీ తెలిసిందేగా! ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడిన ప్రతీ ఆర్టిస్టుకి, ఎంతో సాయం చేశారు. కరోనా క్రైసిస్ ట్రస్ట్ ఓపెన్ చేసి, విరాళాలు సేకరించి, దాదాపు అందరినీ ఆదుకున్నారు. ఆక్సిజన్ ట్యాంకులు కూడా సరఫరా చేశారు. ఇక బ్లడ్ బ్యాంక్ సేవలు గురించి అందరికీ తెలిసిందే! ఇప్పుడు మరోసారి చిరంజీవి తన మంచి మనసు చాటుకున్నారు. అభిమాని చివరి కోరికని తీర్చారు.
ఆ అభిమాని పేరు నాగరాజు. మొగల్తూరుకి చెందినవాడు. ఇతనికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ప్రాణాలతో పోరాడుతున్న ఈ అభిమాని, తన చివరి కోరికగా చిరంజీవిని కలవాలని అనుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే.. నాగరాజుని చిరంజీవి కలిశారు. గంటసేపు అతనితో చర్చించారు. వైద్య సేవలకు కావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందించారు. అతనికి భరోసా కల్పించారు. తన భార్యతో కలిసి వచ్చిన ఆ అభిమానిని సాదరంగా ఆహ్వానించారు. ఆ అభిమానితో కలిసి ఫోటోలు దిగారు. ఎప్పట్నుంచో కలవాలనుకుంటున్న తన అభిమాన హీరోని ఎట్టకేలకు కలవడంతో.. నాగరాజు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరు మంచి మనసు చాటుకున్నారంటూ ఆయన్ను కొనియాడుతున్నారు.