Site icon NTV Telugu

‘అఖండ’ సినిమాపై అర్చకుల సంచలన వ్యాఖ్యలు.. అవును మేము సినిమా చూశాం

akhanda

akhanda

నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను అఖండ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ ని అందుకున్నారు. అఖండ సినిమా విడుదలై అఖండ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తోంది. చిన్నా లేదు.. పెద్దా లేదు.. ఆ హీరో ఫ్యాన్ అని లేదు ఈ హీరో ఫ్యాన్ అని లేదు.. మనుషులు అని లేరు అఘోరాలు అని లేరు.. అందరు ఈ సినిమాను చూసి బాలయ్య విశ్వరూపం గురించి గొంతు చించుకొని మరి అరుస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఎప్పుడు లేని విధంగా ఒక సినిమాను అఘోరాలు వీక్షించడం ఇదే మొదటిసారి అనుకుంటే.. తాజాగా అర్చకులు సైతం అఖండ సినిమాను వీక్షించడం అరుదైన విషయం. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన రంగరాజన్ పంతులు తమ బృందంతో కలిసి అఖండ సినిమాను వీక్షించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.


“అవును.. మేము అఖండ సినిమా చూసాం.. సినిమా చాలా బావుంది.. ఇందులో ధర్మానికి ఎంతటి అన్యాయం చేస్తున్నారో చూపించారు. ‘అహింసా ప్రథమో ధర్మః’ అనే వాక్యాన్ని మనుషులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, అలా దుర్వినియోగం చేసేవారిని అంతం చేయడానికి , ధర్మాన్ని రక్షించడానికి ఎంతకైనా తెగించవచ్చని చూపించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని కోరుకొంటున్నాను. ఈ సినిమా విజయవంతం కావడానికి కారణం .. ధర్మాన్ని రక్షించాల్సిన మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ఆ పని చేస్తే ఆనందంగా చూస్తాం .. అదే ఈ సినిమా విజయానికి కారణం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక సినిమా గురించి దేవుని భక్తులు ఇలా చెప్పడం బహుశా ఇదే మొదటిసారని, అది కేవలం బాలయ్యకే చెందుతోందని బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version