తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ.. అందులో ఒకరు చాందిని చౌదరి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాందిని ‘కలర్ ఫోటో’ చిత్రంతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం కష్టపడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే చాందినీ నటిస్తున్న కొత్త చిత్రం “సమ్మతమే”. కిరణ్ అబ్బవరం హీరోగా గోపినాధ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24 న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఒక టాక్ షో కు హాజరైన కిరణ్, చాందిని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
“నీ కెరీర్ కు ఒక నిర్మాత బ్రేక్ వేశాడు” అని తెలిసింది దాని గురించి ఏం చెప్తావ్ అని యాంకర్ చాందినిని అడుగగా.. “నన్ను ఇండస్ట్రీలో కనపడకుండా చేస్తాను అని బెదిరించాడు. నాతొ పాటు నా ఫ్యామిలీ ని కూడా భయపెట్టాడు.. చివరికి నాకు తెలిసిన విషయం ఏంటంటే.. నాతో సైన్ చేయించుకున్న కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాదని” చెప్పుకొచ్చింది. మరి నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దల దగ్గరకు ఎందుకు వెళ్లలేదు? అని అడుగగా.. “ఎవరి దగ్గరకు వెళ్ళను? నన్ను నేను బ్యాకప్ చేసుకోవడానికి నాకు ఏముంది? చిటికెలో నన్ను మసి చేసేస్తారు కదా” అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం చాందినీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. పెద్దవాళ్ళతో పెట్టుకుంటే తనకు ఏమవుతుందో తెలుసు అన్నట్లుగా ఆమె మాట్లాడింది. మరి చాందినీ ని ఇబ్బంది పెట్టిన ఆ నిర్మాత ఎవరు అని అభిమానులు ఆరా తీస్తున్నారు.