ఈ నాటికీ ఎంతోమంది కె.జె.ఏసుదాస్ మధురగానంతోనే నిదుర లేచి ఆనందిస్తూ ఉంటారు. ఆయన మాతృభూమి కేరళలోనే కాదు, యావద్భారతంలోకె.జె.ఏసుదాస్ మధురస్వరం వింటూనే రోజు ప్రారంభించే సంగీతాభిమానులు ఎందరో ఉన్నారు. నవంబర్ 14తో ఏసుదాస్ మధురగానానికి షష్టి పూర్తి. ఆయన తొలిసారి గానం చేసిన పాట రికార్డ్ అయింది. శ్రీనారాయణ గురు రాసిన జాతి భేదం... మత ద్వేషం...
అంటూ సాగే ఆ పాటను సంగీత దర్శకులు ఎమ్.బి. శ్రీనివాసన్ , ఏసుదాస్ గళంలో కల్పదుకళ్* చిత్రం కోసం రికార్డ్ చేశారు. ప్రేమ్ నజీర్ హీరోగారూపొందిన
కల్పదుకళ్చిత్రం 1962 సెప్టెంబర్ 7న జనం ముందు నిలచింది. ఈ పాటతోనే ఏసుదాస్ మధురగానం తొలిసారి వెలుగు చూసింది.అప్పటికే తెలుగు మధురగాయకుడు పి.బి.శ్రీనివాస్ గానం కేరళ వాసులను ఆనందసాగరంలో ముంచెత్తెంది. కొందరు ఏసుదాస్ గానం విని, పి.బి.శ్రీనివాస్ లాగే ఉందన్నారు. ఆ తరువాత ఏసుదాస్ కొన్ని చిత్రాలలో నటిస్తూ కూడా పాటలు పాడారు. ప్రేమ్ నజీర్ నటించిన అనేక చిత్రాలలోని సూపర్ హిట్ సాంగ్స్ ఏసుదాస్ గళం నుండే జాలువారడం విశేషం. ఆ రోజుల్లో దక్షిణాది భాషలన్ని చిత్రరంగాలు మదరాసులోనే ఉండేవి. దాంతో ఒకరి ప్రతిభ మరొకరికి ఇట్టే తెలిసిపోయేది. అలా తెలుగువారిలోనూ ఏసుదాస్ గాత్రంపై చర్చ సాగింది. సంగీత దర్శకులు ఎస్.పి.కోదండ పాణి చెవిన కూడా ఏసుదాస్ ప్రతిభ సోకింది. తాను స్వరపరచిన
బంగారు తిమ్మరాజు`లో ఆరుద్ర రాసిన ఓ నిండు చందమామ....
సాంగ్ తో తెలుగు సినిమారంగానికి పరిచయంచేశారు. కాంతారావు అభినయంతో సాగిన ఆ పాట ఇప్పటికీ వీనులవిందు చేస్తూనే ఉంది.
అటుపై మళయాళ, తెలుగు, తమిళ, కన్నడ , హిందీ, ఒరియా, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లిష్, లాటిన్, రష్యన్ పాటలతోనూ ఏసుదాస్ స్వరవిన్యాసాలు సాగాయి. జాతీయ స్థాయిలో అత్యధిక సార్లు అంటే 8 సార్లు నిలిచిన మధురగాయకునిగానూ ఏసుదాస్ చరిత్ర సృష్టించారు. ఏసుదాస్ పాటకు, తెలుగు చిత్రసీమకు ఎంతో అనుబంధం ఉంది. యన్టీఆర్ తన శ్రీకృష్ణసత్య
లో ఆంజనేయ స్వామికిపాడిన శ్రీరామ జయరామ...
గీతం ఇప్పటికీ భక్తకోటిని అలరిస్తోంది. ఏయన్నార్ మేఘసందేశం
ద్వారా జాతీయ అవార్డూ లభించింది. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలు సైతం ఏసుదాస్ మధురగానంతో విజయాలను చూశారు. ఇక మోహన్ బాబు తన సొంత చిత్రాలలో తప్పకుండా ఏసుదాస్ గానానికి పెద్ద పీట వేస్తూ సాగారు. తరువతి తరం హీరోల చిత్రాల్లోనూ ఏసుదాస్ మధురగానం మనసులను పులకింప చేసింది. ఏసుదాస్ తనయుడు విజయ్ ఏసుదాస్ సైతం అనేక తెలుగు చిత్రాలలో పాటలు పాడి అలరించారు. ఏసుదాస్ ను తమ సొంతమనిషిగా అభిమానించి, ఆరాధించే వారందరికీ ఆయన గాయకునిగా అరవైఏళ్ళు పూర్తి చేసుకోవడం ఓ పర్వదినం అనే చెప్పాలి. ఆ మధురగళం నుండి మరిన్ని పాటలు జనానికి మధురామృతం పంచుతూనే ఉంటాయని ఆశిద్దాం.