Can RRR And Shyam Singha Roy Movies Get Oscar Awards: ఈ యేడాది తెలుగునాట బ్లాక్ బస్టర్ గా నిలచిన ‘ట్రిపుల్ ఆర్’లో జూనియర్ యన్టీఆర్ అభినయం సర్వత్రా జేజేలు అందుకుంది. ఉత్తరాది వారినే కాదు, విదేశాలలోనూ జూనియర్ నటనకు ప్రశంసలు లభించాయి. ఇజ్రాయెల్ వంటి దేశంలోనూ అక్కడి దినపత్రికల్లో జూనియర్ అభినయాన్ని ప్రశంసిస్తూ ఓ ఫుల్ పేజీ రాయడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఈ వార్తలే అభిమానులకు ఉత్సాహం కలిగిస్తోంటే, ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’ సినిమా ద్వారా జూనియర్ యన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ లభించనుందా? అంటూ కథనాలు మొదలయ్యాయి. అసలు మన జూనియర్ కు ఎందుకు ఆస్కార్ ఇస్తారు? ఆయన ఏమైనా హాలీవుడ్, ఇంగ్లిష్ సినిమాల్లో నటించాడా? అంటూ ప్రశ్నల వర్షం కూడా కురవడం మొదలయింది. అయితే ఇక్కడే ఆస్కార్ నియమ నిబంధనలను ఓ సారి గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.
‘ఆస్కార్ అవార్డ్స్’గా విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైనెన్స్’ అవార్డులు సదా సినిమా ప్రియులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. 1929లో ఈ అకాడమీ అవార్డులు మొదలయినప్పుడు కొన్ని కేటగిరీలే ఉండేవి. తొలుత పది విభాగాల్లో అవార్డులు ఇచ్చేవారు. 1930లో ఆ సంఖ్యను ఏడుకు తగ్గించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాత, ఉత్తమ నటి, ఉత్తమ కథ/ స్క్రీన్ ప్లే , ఉత్తమ ఫోటోగ్రఫి, ఉత్తమ శబ్దగ్రాహక చిత్రం వంటివే ఆరంభంలో కనిపించాయి. హాలీవుడ్ సినిమాలను ప్రోత్సహించడం కోసమే ఈ అకాడమీ అవార్డులు మొదలయ్యాయి. తరువాత బ్రిటన్ లో నిర్మించిన ఆంగ్ల చిత్రాలనూ అకాడమీ అవార్డుల్లో గౌరవించారు. అందువల్ల అమెరికా, బ్రిటన్ లో రూపొందిన ఆంగ్ల చిత్రాలను ప్రోత్సహించడానికే ‘అకాడమీ అవార్డులు’ నెలకొన్నాయి. అయినా ప్రపంచ వ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు క్రేజ్ ఉండేది. దాంతో విదేశీ చిత్రాలనూ ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రెండవ ప్రపంచ యుద్ధానంతరం ‘బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిలిమ్’ అనే విభాగం ఏర్పాటు చేశారు. ఈ కేటగిరీలో తొలి అవార్డు అందుకున్న చిత్రంగా 1946లో రూపొందిన ఇటాలియన్ మూవీ ‘షూషైన్’ నిలచింది. ఆ తరువాత నుంచీ అనేక విదేశీ చిత్రాలు ఈ విభాగంలో నామినేషన్స్ సంపాదించాయి. కొన్ని విజేతలుగానూ నిలిచాయి. 2020లో ఈ విభాగాన్ని ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిమ్’ గా మార్చారు.
ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం నుండి తొలిసారి నామినేషన్ సంపాదించిన చిత్రం ‘మదర్ ఇండియా’ (1957). ఆ తరువాత 1988లో ‘సలామ్ బాంబే’, 2001లో ‘లగాన్’ సినిమాలు ఈ కేటగిరీలోనే నామినేషన్స్ దక్కించుకున్నాయి. అయితే విజేతలుగా నిలవలేక పోయాయి. ఆస్కార్ అవార్డులు సంపాదించాలంటే తప్పకుండా అమెరికా లేదా బ్రిటిన్ దేశాలతో మిళితమై చిత్రాలను నిర్మించాలి. లేదా కేవలం ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో పోటీ పడాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన సినీ ప్రముఖులకు ముఖ్యంగా దర్శకులకు ‘గౌరవ ఆస్కార్ అవార్డు’ అందించే సంప్రదాయం ఉంది. ఈ కేటగిరీలో మన భారతీయ దర్శకులు సత్యజిత్ రే గౌరవం పొందారు. మన దేశంలో మొట్టమొదటి ఆస్కార్ అవార్డు విజేతగా భానూ అతియా నిలిచారు. రిచర్డ్ అటెన్ బరో మన దేశంలో నిర్మించిన ‘గాంధీ’ చిత్రానికి భానూ క్యాస్టూమ్ డిజైనర్ గా పనిచేసి, ఆస్కార్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా బ్రిటన్ దేశస్థుడైన అటెన్ బరో నిర్మించి, దర్శకత్వం వహించిన ఆంగ్ల చిత్రం. పోటీ విభాగంలో ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ వ్యక్తి భానూ అతియానే! తరువాత ‘స్లమ్ డాగ్ మిలియనీయర్’ ఆంగ్ల చిత్రం ద్వారా ఎ.ఆర్.రహమాన్, గుల్జార్ ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్నారు.
ఇక ఇప్పుడు యాక్టింగ్ విభాగంలో జూనియర్ యన్టీఆర్ కు ఎలా నామినేషన్ లభిస్తుంది అనే ప్రశ్నకు ఆస్కార్ నియమాలను చూద్దాం.
హాలీవుడ్, బ్రిటన్ నిర్మించిన ఇంగ్లిష్ సినిమాల్లో నటించి పరదేశీయులు కూడా బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు సంపాదించారు. అయితే ఓ విదేశీ చిత్రం ద్వారా యాక్టింగ్ లో బెస్ట్ అనిపించుకున్నది ఇప్పటి దాకా ఇటాలియన్ యాక్టర్ రాబర్ట్ బెనిగ్నీ మాత్రమే. 1997లో తాను దర్శకత్వం వహించి, నటించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ద్వారా బెనిగ్నీ బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నారు. ఆ తరువాత పలువురు నామినేషన్స్ సంపాదించినా విజేతలుగా నిలువలేదు. ఇప్పుడు ఆ ఆస్కారం ‘ట్రిపుల్ ఆర్’ ద్వారా జూనియర్ యన్టీఆర్ కు లభించనుందని తెలుస్తోంది. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం కూడా కొన్ని విభాగాల్లో ఎంట్రీకై ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే ఆస్కార్ నామినేషన్ సంపాదించడానికి మనం అప్లై చేసే కేటగిరీలోని చిత్రం ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో నిర్ణయించిన కేలండర్ ఇయర్ లో లాస్ ఏంజెలెస్ లో ప్రదర్శితమై ఉండాలి. జూనియర్ నటించిన ‘ట్రిపుల్ ఆర్’ లాస్ ఏంజెలెస్ లో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శితమయింది. కాబట్టి తారక్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఎంట్రీకి ప్రయత్నించవచ్చు. ఒకవేళ ఈ విభాగంలో జూనియర్ కు నామినేషన్ లభించినా, అదో చరిత్ర అవుతుంది. ఎందుకంటే ఇప్పటి దాకా ఏ తెలుగునటునికీ జాతీయ స్థాయిలోనే బెస్ట్ యాక్టర్ గా అవార్డు లభించలేదు. అలాంటిది ప్రపంచ విఖ్యాతి గాంచిన ఆస్కార్ నామినేషన్ లభించడమంటే ఎంతో విశేషం. ఇక నామినేషన్ లభించి, అవార్డు కూడా జూనియర్ యన్టీఆర్ పరమైతే అది తెలుగువారికే కాదు, భారతీయులకూ మరపురాని మరువలేని చరిత్ర అవుతుంది.