చిలకలపూడి సీతారామాంజనేయులు అంటే అంతగా ఎవరికీ తెలియదు కానీ, షార్ట్ గా ‘సీఎస్సార్’ అనగానే చప్పున గుర్తు పట్టేస్తారు జనం. తనదైన వాచకాభినయంతో అలరించిన సీఎస్సార్, విలక్షణమైన పాత్రల్లో ఎంతగానో ఆకట్టుకున్నారు. నటరత్న యన్టీఆర్ కు ముందు తెలుగునాట శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలచిన వారిలో సీఎస్సార్ కూడా ఉన్నారు. ఆ పై ప్రతినాయకునిగా, గుణచిత్ర నటునిగా హాస్యం పలికిస్తూ సాగిపోయారాయన.
సి.ఎస్.ఆర్.ఆంజనేయులు 1907 జూలై 11న మచిలీపట్నంలోని చిలకలపూడిలో జన్మించారు. స్కూల్ చదువు కాగానే, పై చదువులకు పోకుండా సీఎస్సార్ నాటకరంగాన్ని ఎంచుకున్నారు. రంగస్థలంపై తనదైన బాణీ పలికించిన సీఎస్సార్ ను ‘రామపాదుకా పట్టాభిషేకం’లో ఎంపిక చేశారు. అందులో శ్రీరామునిగా యడవల్లి సూర్యనారాయణ నటించగా, ఆయన సోదరునిగా సీఎస్సార్ అభినయించారు. తరువాత ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’లో శ్రీకృష్ణునిగా నటించి ఆకట్టుకున్నారు సీఎస్సార్. ‘తుకారామ్’లో తుకారామ్ గా, ‘జయప్రద’లో పురూరవ చక్రవర్తిగా, ‘బాలాజీ’లో శ్రీనివాసునిగా, ‘పాదుకాపట్టాభిషేకం’లో శ్రీరామునిగా నటించి జనాన్ని మురిపించారు సీఎస్సార్. అయితే నలభై ఏళ్ళు దాటగానే కేరెక్టర్ రోల్స్ లోకి పరకాయ ప్రవేశం చేయసాగారాయన. యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన ‘పాతాళభైరవి’లో రాజుగా సీఎస్సార్ అభినయం ఎంతగానో అలరించింది. ఆపై “పెళ్ళి చేసి చూడు, దేవదాసు, చరణదాసి, కన్యాశుల్కం, రోజులు మారాయి. భాగ్యరేఖ, అప్పు చేసి పప్పుకూడు, ఇల్లరికం, భీష్మ, సవతికొడుకు, ఇరుగు పొరుగు” వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. అన్నిటినీ మించి ‘మాయాబజార్’లో శకునిగా ఆయన విలక్షణమైన అభినయాన్ని ప్రదర్శించారు. ఆ పాత్ర ఈ నాటికీ జనాన్ని అలరిస్తూనే ఉండడం విశేషం! ఇంతలా అలరించిన సీఎస్సార్ 1963 అక్టోబర్ 8న కన్నుమూశారు. సీఎస్సార్ ను అనుకరిస్తూ, ఆయన వాచకాన్ని ఒడిసిపట్టి పలువురు నటులు సాగారు. కానీ, ఎవరూ ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేక పోవడం గమనార్హం!