Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామి వారి దర్శనం చేసుకొని బ్రహ్మానందం బయటికి రాగానే భక్తులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. అయితే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మీ .. ముందు స్వామివారిని దర్శించుకొని అనంతరం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లారు. అంతేకాకుండా అక్కడ మరణించిన కళాకారుడు కుటుంబానికి రెండు లక్షలా 17వేలు అందించి గొప్పమనసు చాటుకున్నారు.
ఇక ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ” సహజ అంశాన్ని కళాకారుడు తన నైపుణ్యంతో జీవకళను జోడించితేనే అద్భుతాలు సాధ్యమవుతాయి. శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మిత్రుడు సలహాతో నేను చిత్రీకరించిన చిత్రాన్ని పుస్తకం పై ముద్రించడం నాకు గర్వకారణమని చెప్పాలి. కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ అందరికీ రావు.. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం అవుతుంది. కళాకారులు తమ బాహ్య రూపానికి కంటే అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. గడ్డిపువ్వులో అందాన్ని చూస్తేనే ఆధ్యాత్మిక ఆంతర్యం అర్ధమవుతుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలియడంతో బ్రహ్మీ మంచి మనసును అభిమానులు ప్రశంసిస్తున్నారు.