విజయమే లక్ష్యంగా సాగిన నాగిరెడ్డి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో మరపురాని, మరచిపోలేని చిత్రాలను అందించిన సంస్థగా ‘విజయా ప్రొడక్షన్స్’ నిలచిపోయింది. ఆ సంస్థ రథసారథులు బి.నాగిరెడ్డి – చక్రపాణి కూడా జనం మదిలో అలాగే సుస్థిర స్థానం సంపాదించారు. ఒకే ఆత్మ రెండు శరీరాలుగా నాగిరెడ్డి, చక్రపాణి మసలుకున్నారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచారు. చక్రపాణిది ఆలోచన అయితే, దానిని ఆచరించడంలో నాగిరెడ్డి మేటిగా నిలిచేవారు. స్నేహబంధానికి మారుపేరుగా నిలచిన వీరిద్దరిలో నాగిరెడ్డి మిత్రుడు కన్నుమూశాక, సినిమాలు నిర్మించడం మానేశారు. విలువలకు పట్టం కడుతూ చిత్రాలను నిర్మించారు. అందుకే ఈ నాటికీ జనం బి.నాగిరెడ్డిని స్మరించుకుంటూ ఉన్నారు.
బొమ్మిరెడ్డి నాగిరెడ్డి 1912 డిసెంబర్ 2న కడప జిల్లాలోని పొట్టిపాడు గ్రామంలో జన్మించారు. ఆయన అన్న బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి చిత్రసీమలో బి.యన్.రెడ్డిగా సుప్రసిద్ధులు. బి.యన్. రెడ్డి దర్శకనిర్మాతగా సాగుతున్న సమయంలో నాగిరెడ్డి, తన తండ్రి వద్ద ఉంటూ వ్యాపారం చూసుకొనేవారు. వారి కుటుంబ వ్యాపారాలు ఆ రోజుల్లో బర్మాదాకా సాగేవి. ఆ వ్యవహారాలు చూసుకుంటూనే తన అభిరుచికి తగ్గట్టుగా ‘ఆంధ్రజ్యోతి’ అనే పత్రికను నడిపారు. తరువాత అన్న బి.యన్.రెడ్డి చిత్రాలకు ప్రచారకర్తగా పలు కొత్త పుంతలు చూపారు. ఓ సినిమా ఓ ఊరిలో ఆడుతూ ఉంటే, ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎడ్ల బండ్లు కట్టి, వాటికి సదరు సినిమాల పోస్టర్స్ అతికించి ప్రచారం చేయించేవారు. అదే పంథాను తరువాతి రోజుల్లో అందరూ అనుసరించడం విశేషం. నాగిరెడ్డికి మద్రాసులోనే ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. అక్కడకు చక్రపాణి తన రచనలు అచ్చు వేయించుకోవడానికి వచ్చేవారు. అలా వారిద్దరి మధ్య స్నేహబంధం కుదిరింది. అది అనతికాలంలోనే బలపడింది. ఇద్దరి అభిరుచులూ కలిశాయి. సాహిత్యం, సినిమాలపై చర్చించుకుంటూ ఉండేవారు. వారిద్దరూ కలసి ‘చందమామ’ బాలల పత్రికను స్థాపించారు. 1947లో మొదలైన ‘చందమామ’ తరువాతి కాలంలో ఆబాలగోపాలాన్నీ విశేషంగా ఆకట్టుకుంది. 14 భాషల్లో ‘చందమామ’ వెలుగు చూసింది.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
నాగిరెడ్డి కూతురు విజయ పేరు మీద విజయా ప్రొడక్షన్స్ నెలకొల్పారు నాగిరెడ్డి, చక్రపాణి. తమ అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించాలని నాగిరెడ్డి, చక్రపాణి తొలి ప్రయత్నంగా ‘షావుకారు’ నిర్మించారు. ఈ నాటికీ ‘షావుకారు’ చిత్రం జనాన్ని ఆకట్టుకుంటూనే ఉంది. దీని తరువాత ఆ రోజుల్లో భారీగా నిర్మించిన ‘పాతాళభైరవి’ జానపదం తెలుగు చిత్రసీమలో తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలచింది. ‘పాతాళభైరవి’ని తమిళంలోనూ తెరకెక్కించారు. అప్పటి నుంచీ విజయా సంస్థ నిర్మించే చిత్రాలను ద్విభాషల్లో రూపొందించేవారు. నాగిరెడ్డి చక్రపాణి నిర్మించిన “పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మ కథ, సి.ఐ.డి.” విశేషాదరణ చూరగొన్నాయి. ఈ చిత్రాలన్నిటా యన్టీఆర్ హీరోగా నటించారు. ఆయనతోనే విజయా సంస్థ “చంద్రహారం, సత్య హరిశ్చంద్ర, ఉమాగౌరీచండీ శంకరుల కథ” కూడా నిర్మించింది. విజయా సంస్థ యన్టీఆర్ తో నిర్మించిన వాటిలో విజయం సాధించిన తొమ్మిది చిత్రాలను ‘నవరత్నాలు’గా భావించేవారు.
విజయా సంస్థ తెలుగులో నిర్మించిన తొలి రంగుల చిత్రం ‘గంగ-మంగ’. తరువాత చక్రపాణి దర్శకత్వంలో ‘శ్రీరాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ నిర్మించడం ఆరంభించారు. నిర్మాణం ఆరంభం కాగానే చక్రపాణి కన్నుమూశారు. బాపు ఆ సినిమాను పూర్తి చేశారు. మిత్రుడు చక్రపాణి మరణం, నాగిరెడ్డిని కలచి వేసింది. ఆ తరువాత తెలుగులో ఆయన చిత్రాలు నిర్మించలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నాగిరెడ్డి, చక్రపాణి సినిమాలు నిర్మించారు. విజయా సంస్థ నిర్మించిన చిత్రాల ద్వారా ఎందరో మహానటులు తమ అభినయ వైభవం ప్రదర్శించారు. ఇక యన్టీఆర్ అంటే నాగిరెడ్డికి ప్రత్యేక అభిమానం. ‘విజయవారి విజయసారథి’గా యన్టీఆర్ ను అభివర్ణించేవారు నాగిరెడ్డి.
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా నాగిరెడ్డి ఉన్న సమయంలోనే ‘వైకుంఠం క్యూ కాంప్లెక్స్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1972లో ‘విజయ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేశారు నాగిరెడ్డి. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే మద్రాసులో విజయా హాస్పిటల్, విజయ హెల్త్ కేర్ సెంటర్, విజయా హార్ట్ ఫౌండేషన్ సాగుతున్నాయి. చిత్రసీమకు నాగిరెడ్డి అందించిన సేవలకు 1986లో భారత ప్రభుత్వం ఆయనను ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’తో గౌరవించింది. ఆ తరువాత 1987లో నాగిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సన్మానించింది. ఆయన తనయులు వెంకట్రామిరెడ్డి, విశ్వనాథ్ రెడ్డి కూడా తండ్రి బాటలోనే కొన్ని చిత్రాలు నిర్మించారు. 2004 ఫిబ్రవరి 25న నాగిరెడ్డి తుదిశ్వాస విడిచారు. ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్టూడియోస్ గా విరాజిల్లిన ‘విజయా-వాహినీ స్టూడియోస్’ అధినేతగా, మరపురాని చిత్రాలు అందించిన ‘విజయాధినేత’గా జనం మదిలో నిలచిపోయారు నాగిరెడ్డి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!