Site icon NTV Telugu

Ravi Shankar Birthday: రవిశంకర్ ‘గళ’ విన్యాసాలు

Ravi Shankar

Ravi Shankar

Ravi Shankar Birthday: నటుడు రవిశంకర్ అంటే చప్పున గుర్తుకు రాకపోవచ్చు. కానీ ‘బొమ్మాళీ… నిన్నొదల..’ అంటూ ఆయన గళం చేసిన మాయాజాలాన్ని జనం ఎప్పటికీ మరచిపోలేరు. అన్న సాయికుమార్, తండ్రి పి.జె.శర్మ చూపిన బాటలోనే పయనిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు రవిశంకర్. ఆయన గళవిన్యాసాలతో పలు చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అనువాద చిత్రాలలో ప్రతినాయకులకు రవిశంకర్ గళం ప్రాణం పోసిందనే చెప్పాలి.

పూడిపెద్ది రవిశంకర్ 1966 నవంబర్ 28న మద్రాసులో జన్మించారు. ఆయన తండ్రి పి.జె.శర్మ, తల్లి కృష్ణజ్యోతి నటనలో రాణించిన వారే. అలా బాల్యం నుంచీ రవిశంకర్ సినిమా వాతావరణంలోనే పెరిగారు. రవిశంకర్ బాలనటునిగా ‘గోరింటాకు, ఛాలెంజ్ రాముడు, సప్తపది’ వంటి చిత్రాలలో నటించారు. అన్న సాయికుమార్ కు కన్నడ చిత్రసీమలో హీరోగా విశేషమైన గుర్తింపు లభించడంతో రవిశంకర్ కూడా అటువైపు సాగిపోయారు. అనేక కన్నడ చిత్రాలలో నటించారు. ఆ తరువాత తెలుగులోనూ రవిశంకర్ కు నటునిగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ఓ వైపు నటిస్తూనే మరో వైపు డబ్బింగ్ చెబుతూ సాగారు రవి. దాదాపు 3500 అనువాద చిత్రాలలో రవిశంకర్ గాత్రం వినిపించింది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో మొత్తం 150 చిత్రాలలో రవిశంకర్ నటించారు.

అనువాద కళాకారునిగా రవిశంకర్ బిజీబిజీగా సాగుతున్నారు. ఏడు సార్లు బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డులు అందుకున్నారు రవిశంకర్. జూనియర్ యన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’లో ప్రధాన ప్రతినాయకునిగా కనిపించిన రవిశంకర్, ‘క్రాక్’లో ఓ కామెడీ రోల్ లో అలరించారు. అంతకు ముందు మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’లోనూ ఓ కీలక పాత్రలో కనిపించారు. చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ‘భోళాశంకర్’లోనూ రవిశంకర్ ఓ కీ రోల్ పోషిస్తున్నారు. కేవలం అనువాద కళాకారునిగా గాత్రం పలికించడమే కాదు, కొన్ని చిత్రాలలో తన గళాన్నీ వినిపిస్తూ పాటలు పాడారు రవిశంకర్. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ రెండు భాగాల్లోనూ రవిశంకర్ గాయకునిగా అలరించారు. ‘బెజవాడ, వంగవీటి, రాజరథం’ వంటి చిత్రాలలోనూ రవిశంకర్ పాటలు పాడారు.

రవిశంకర్ భార్య పంజాబీ. పేరు సుచిల్. ఈ దంపతులకు అద్వేయ్ అనే కుమారుడు ఉన్నాడు. తన తనయుణ్ణి నటునిగా స్వీయ దర్శకత్వంలో పరిచయం చేస్తానని రవిశంకర్ అప్పట్లో ప్రకటించారు. 2004లో ‘దుర్గి’ అనే కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించారు రవిశంకర్. ఈ చిత్రం తెలుగులో జూనియర్ యన్టీఆర్ హీరోగా ‘నరసింహుడు’ పేరుతో రూపొందింది. మాతృభాష తెలుగులోనే కాదు పరభాషల్లోనూ రవిశంకర్ తన అభినయంతోనూ, గాత్రంతోనూ ఆకట్టుకుంటూ సాగుతున్నారు. మునుముందు రవిశంకర్ తన నటనతోనూ, గళంతోనూ ఎలాంటి విన్యాసాలు చేస్తారో చూద్దాం.

(నవంబర్ 28న రవిశంకర్ పుట్టినరోజు)

Exit mobile version