Tollywood: ఒకప్పుడు హిందీ చిత్రసీమలో ఏ ట్రెండ్ నడుస్తుంటే, దానిని సౌత్ సినీజనం గుడ్డిగా అనుసరించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. సౌత్ ట్రెండ్ ను ఫాలో అవడానికి బాలీవుడ్ ఏ మాత్రం వెనుకాడడం లేదు. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలోని విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, వాటిని అనుసరించడానికి హిందీ సినీజనం సై అంటున్నారు. అందులో భాగంగానే కింగ్ షారుఖ్ ఖాన్ బర్త్ డే నవంబర్ 2న ఆయన ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ చిత్రాన్ని రీ -రిలీజ్ చేశారు. నిజంగా షారుఖ్ ఫ్యాన్స్ కు ఇది ఆనందం కలిగించే విషయమే! ఈ ట్రెండ్ కు సౌత్ లో ముఖ్యంగా తెలుగునాట ఎప్పుడో శ్రీకారం చుట్టారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్ తో పాటు ప్రభాస్, మహేశ్, జూనియర్ యన్టీఆర్ లాంటి యంగ్ స్టార్స్ పుట్టినరోజులకు వారి సినిమాలను విడుదల చేసి, అభిమానులకు ఆనందం పంచారు. ప్రభాస్ పుట్టినరోజయిన అక్టోబర్ 23న ఆయన నటించిన ‘బిల్లా’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. అంతకు ముందు సెప్టెంబర్ 25న ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయగా, బాలకృష్ణ ఫ్యాన్స్ సంబరపడిపోతూ, సదరు చిత్రాన్ని విజయపథంలో పయనింప చేశారు. అలాగే ఒకప్పుడు ‘వై దిస్ కొలవరి కొలవరి డీ…’ అనే పాటతో మురిపించిన ధనుష్ ‘3’ తెలుగు డబ్బింగ్ ను సైతం రీ-రిలీజ్ చేశారు. ఇలా తెలుగునాట ఏదో ఒక విధంగా రిపీట్ రన్స్ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే షారుఖ్ ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ ఆయన పుట్టినరోజున విడుదల కావడంతో ఈ ముచ్చట గుర్తు చేసుకోవలసి వచ్చింది.
నిజానికి ఈ యేడాది షారుఖ్ హీరోగా నటించిన ఏ చిత్రమూ విడుదల కాలేదు. ఆయన కనిపించిన “బ్రహ్మాస్త్ర, లాల్ సింగ్ ఛద్దా, రాకెట్రీ” వంటి చిత్రాలూ అంతగా అలరించలేదు. ఈ నేపథ్యంలోనే షారుఖ్ ఆల్ టైమ్ హిట్ ను రీ-రిలీజ్ చేసి ఆయన అభిమానులకు ఆనందం పంచారు. ఈ సినిమా అందించే ఊపు ఇలాగే కొనసాగితే, జనవరిలో వెలుగు చూడనున్న షారుఖ్ తాజా చిత్రం ‘పఠాన్’ ఓపెనింగ్స్ కు ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ రిపీట్ రన్ పరోక్షంగా దోహదపడనుంది. ఇదే ట్రెండ్ ను ఇతర బాలీవుడ్ టాప్ హీరోస్ కూడా కంటిన్యూచేస్తే బాగుంటుందని అక్కడి సినీజనం ఆశిస్తున్నారు. మరో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పుట్టినరోజు డిసెంబర్ 27న జరగనుంది. ఆయన నటించిన చిత్రాలలో ఏదైనా రీ-రిలీజ్ చేస్తే బాగుంటుందనీ సల్మాన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆమిర్ ఖాన్ పుట్టినరోజు మార్చి 14న అయిపోయింది. కాబట్టి, వచ్చే యేడాది ఆమిర్ పుట్టినరోజున కూడా ఏదైనా పాత చిత్రం విడుదల చేస్తే బాగుంటుందనీ భావిస్తున్నారు. ఈ లోగా డిసెంబర్ 9న ఆమిర్ అతిథి పాత్రలో కనిపించే ‘సలామ్ వెంకీ’ రానుంది. ఏది ఏమైనా, అభిమాన హీరో పాత చిత్రం వస్తేనే ఓ కిక్కుంటుందని ఫ్యాన్స్ భావన. ఇదే పంథాలో అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ కూడా పయనిస్తారేమో చూడాలి.