NTV Telugu Site icon

తెలుగు వారితో దిలీప్ బంధం!

dilip kumar

dilip kumar

తెలుగునాట మహానటులుగా వెలుగొందిన యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరితోనూ దిలీప్ కుమార్ కు సత్సంబంధాలు ఉండేవి. తెలుగులో యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా నటించిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం 1950లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాను జెమినీ పతాకంపై ఎస్.ఎస్.వాసన్ హిందీలో ‘ఇన్సానియత్’గా రీమేక్ చేశారు. 1955లో విడుదలైన ఈ సినిమాలో ఏయన్నార్ పాత్రలో దిలీప్ కుమార్, యన్టీఆర్ పాత్రలో దేవానంద్ నటించారు.

తెలుగులో ఏయన్నార్ ‘దేవదాసు’గా నటించి అలరించగా, ఉత్తరాదిన హిందీ ‘దేవదాస్’లో దిలీప్ నటించి మెప్పించారు. అక్కినేని ‘దేవదాసు’ చూసిన దిలీప్, “ఏయన్నార్ ఇంత బాగా చేశారని తెలిస్తే, నేను దేవదాసు పాత్ర నటించడానికి అంగీకరించేవాణ్ణే కాదు” అని కితాబు నిచ్చారు. అదే తీరున దిలీప్ ‘దేవదాస్’ చూసిన అక్కినేని, “మా ‘దేవదాసు’లో హీరోని ప్రేమికునిగా చిత్రీకరించారు. అసలైన ఆత్మ దిలీప్ ‘దేవదాస్’లోనే ఉంది” అంటూ ప్రశంసించారు.

యన్టీఆర్ ‘అగ్గిరాముడు’ను దిలీప్ కుమార్ తో హిందీలో ‘ఆజాద్’గా తెరకెక్కించారు. యన్టీఆర్ “రాముడు-భీముడు” చిత్రాన్ని హిందీలో దిలీప్ కుమార్ తో ‘రామ్ ఔర్ శ్యామ్’గా రూపొందించారు. యన్టీఆర్ కు ‘రాముడు-భీముడు’, దిలీప్ కు ‘రామ్ ఔర్ శ్యామ్’ తొలి ద్విపాత్రాభినయ చిత్రాలు కావడం విశేషం. యన్టీఆర్ లాగే దిలీప్ కూడా ఉత్తరాదిన జానపద కథానాయకునిగా వెలుగొందారు. దిలీప్ ‘ఆన్’ చిత్రం ఆధారంగానే యన్టీఆర్ ‘బందిపోటు’ తెరకెక్కడం విశేషం. అలాగే దిలీప్ ‘కోహినూర్’ ఆధారంగా కొన్ని యన్టీఆర్ జానపద చిత్రాల్లోని సన్నివేశాలు రూపొందాయి. దిలీప్ ‘మేలా’ లోని కొన్ని సన్నివేశాలతోనే యన్టీఆర్ ‘చిరంజీవులు’ తెరకెక్కింది. యన్టీఆర్ ‘గుడిగంటలు’ హిందీలో దిలీప్ ‘ఆద్మీ’గా రూపొందింది. దిలీప్ నటించిన ‘మొఘల్- ఏ ఆజమ్’ ఆధారంగానే యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ తెరకెక్కించారు. దిలీప్ ‘గోపీ’ మాతృకగా యన్టీఆర్ తో బి.విఠలాచార్య ‘పల్లెటూరి చిన్నోడు’ తీశారు. యన్టీఆర్ ‘కొండవీటి సింహం’ పోలికలతో దిలీప్ ‘శక్తి’ తెరకెక్కింది.

తెలుగువారయిన కృష్ణంరాజు నిర్మించగా కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘ధర్మాధికారి’లోనూ, బి.గోపాల్ దర్శకత్వంలో ఏఎస్ఆర్ ఆంజనేయులు నిర్మించిన ‘కానూన్ అప్నా అప్నా’లోనూ దిలీప్ కుమార్ నటించారు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఆధారంగా ‘ధర్మాధికారి’, ‘కలెక్టర్ గారి అబ్బాయి’ రీమేక్ గా ‘కానూన్ అప్నా అప్నా’ రూపొందాయి.

ఇక 1976లో హైదరాబాద్ లో జరిగిన ఛారిటీ క్రికెట్ లో దిలీప్ కుమార్ ఉత్తరాది నటవర్గం పాల్గొన్న టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించగా, దక్షిణాది తారలతో నిండిన జట్టుకు యన్టీఆర్ సారథ్యం వహించారు.

యన్టీఆర్ జాతీయ అవార్డును నెలకొల్పిన తరువాత తొలి అవార్డును ఏయన్నార్ 1996లో అందుకోగా, తరువాతి సంవత్సరం 1997లో దిలీప్ కుమార్ అందుకున్నారు. అలా యన్టీఆర్ జాతీయ అవార్డును తొలుత ‘ఇద్దరు దేవదాసులు’ చేజిక్కించుకోవడం అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు.