Ravi Kishan: బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేసు గుర్రంలో అల్లు అర్జున్ కు ధీటుగా విలనిజాన్ని పండించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ మెప్పిస్తున్న రవికిషన్ తన స్నేహితుడుపైనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. రవి కిషన్, 2012లో తన స్నేహితుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త అయిన జైన్ జితేంద్ర రమేశ్ కు రవి కిషన్ 3.25 కోట్లు ఇచ్చాడు. అనంతరం రవి కిషన్ డబ్బు అవసరమై అడుగగా అతను తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు.
ఇక మధ్య మధ్యలో అతను చెక్స్ ఇవ్వడం అవి బౌన్స్ అవ్వడం జరుగుతూ ఉండేవి.. ఇప్పటివరకు రమేశ్ 12 చెక్కులు ఇచ్చాడని, అవన్నీ బౌన్స్ అయ్యినట్లు రవి కిషన్ తెలిపాడు. ఇక కొన్నిరోజుల నుంచి తన ఫోన్లు కూడా ఎత్తకపోవడంతో గోరఖ్‌పూర్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేసినట్టు రవికిషన్ పీఆర్‌వో పవన్ ధూబే తెలిపారు. తన డబ్బును తిరిగి ఇప్పించమని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.