అటల్ బిహారీ వాజపేయి నిష్కళంక దేశభక్తుడే కాదు… ప్రధానిగా దేశానికి సేవ చేసిన గొప్ప రాజకీయనాయకులు. 1924 డిసెంబర్ 24న గ్వాలియర్ లోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వాజపేయి గ్వాలియర్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. యుక్తవయసులో ఆర్యసమాజ్ లో చేరిన వాజపేయి ఆ తర్వాత ఆర్.ఎస్.ఎస్. ప్రభావానికి లోనై ప్రచారక్ గా బాధ్యతలు స్వీకరించారు. పాత్రికేయునిగా విశేష సేవలు అందించిన ఆయన ఆ తర్వాత భారతీయ జనసంఘ్, బీజేపీ పార్టీలలో అతున్నత పదవులను అధిష్టించారు. 1996 – 2004 మధ్య మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేసిన ఆయన ఆజన్మాంత బ్రహ్మచారి.
అటల్ బిహారీ వాజపేయి జీవితం ఆధారంగా ఉల్లేఖ్ ఎన్.పి. రాసిన ‘ద అన్ టోల్డ్ వాజపేయి: పొలిటీషియన్ అండ్ పారడాక్స్’ పుస్తకం ఆధారంగా ఇప్పుడో సినిమా రూపుదిద్దుకోబోతోంది. ‘మై రహూ యా నా రహూ యహ్ దేశ్ రహనా చాహియే : అటల్’ అనే పేరుతో ఈ సినిమాను వినోద్ భానుశాలి, సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. మంగళ వారం ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేస్తూ మోషన్ పోస్టర్ ను వాజపేయి వాయిస్ తో విడుదల చేశారు. వాజపేయి 99వ జయంతి సందర్భంగా ఈ సినిమా 2023 క్రిస్మస్ కు విడుదల కానుంది. ఈ సినిమా దర్శకుడితో పాటు నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.