నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ‘బింబిసార’. కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సోషియో ఫాంటసీ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిగర్తల సామ్రాజ్యపు చక్రవర్తి బింబిసారుడి జీవిత కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. రాక్షస స్వభావం గల బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ లుక్ అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ ను రిలీజ్ చేసింది.
ఈశ్వరుడే అంటూ సాగిన ఈ గీతం బింబిసారుని స్వభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. “భువిపై ఎవడూ కనివిని ఎరుగని అద్భుతమే జరిగినే.. దివిలో సైతం కథగా రాని విధి లీలే వెలిగినే.. ఈశ్వరుడు చేసిన కొత్త గారడే.. భిక్షుడయ్యే బింబిసారుడే” అంటూ సాగిన లిరిక్స్ ఎంతో అర్థమవంతంగా ఉన్నాయి. ఇక ఈ సాంగ్ కు చిరంతన్ భట్ స్వరాలు సమకూర్చగా.. కాల భైరవ తన బేస్ వాయిస్ తో ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. గత కొన్నేళ్ల నుంచి విజయం కోసం పరితపిస్తున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా గట్టి విజయాన్ని అందించేలా ఉందని అభిమానులు అంటున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్ అందుకొని ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.
