Billa- Ranga: సినిమాల పుణ్యమా అని దొంగలు, హంతకులు, నియంతలు సైతం తరువాతి రోజుల్లో హీరోలుగా చెలామణీ అయిపోతారు. నిజానికి అసలైన వారిని ఆకాశానికి ఎత్తవలసిన పని సినిమా జనానికి లేదు. కానీ, తమ ప్రాజెక్టుకు కాసింత క్రేజ్ కోసం వారి పేర్లు తగిలించుకోవడం కొత్తేమీ కాదు. యావద్దేశం నివ్వెరపోయేలా చేసిన హంతకులు కుల్ జీత్ సింగ్ (రంగా ఖుష్), జస్బీర్ సింగ్ (బిల్లా). ఢిల్లీలో ఓ నేవల్ ఆఫీసర్ పిల్లలు గీత, సంజయ్ చోప్రాను 1978 ఆగస్టు 26న బిల్లా-రంగా కిడ్నాప్ చేసి, వారి తండ్రిని డబ్బు డిమాండ్ చేశారు. తరువాత ఆయన నేవల్ ఆఫీసర్ అని తెలియగానే, ఆ పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. చివరకు బిల్లా-రంగాను పోలీసులు అరెస్ట్ చేశారు.
వారికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 1982 జనవరి 31న బిల్లా-రంగాను ఉరి తీశారు. సంచలనం సృష్టించిన గీత-సంజయ్ చోప్రా కేసు ఈ నాటికీ సినీజనానికి కథావస్తువుగా పనికి వస్తోంది. ఈ నేరస్థుల పేర్లను కలిపి ‘బిల్లా-రంగా’ అనే తెలుగు చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు కె.యస్.ఆర్.దాస్. ఈ సినిమాలో బిల్లాగా చిరంజీవి, రంగాగా మోహన్ బాబు నటించారు. టైటిల్స్ కు ముందుగానే ఈ సినిమాలోని పాత్రలు కల్పితాలు అంటూ ఓ కార్డ్ వేశారు నిర్మాణ సంస్థ పి.యన్.ఆర్.పిక్చర్స్ అధినేత పింజల నాగేశ్వరరావు. ఈ చిత్రం 1982 అక్టోబర్ 15న విడుదలయింది.
ఈ ‘బిల్లా-రంగా’ కథ ఏమిటంటే – బిల్లా దొంగతనాలు చేస్తూ జీవిస్తూంటాడు. రంగా అన్యాయంగా సంపాదించేవారిని దోచేస్తుంటాడు. ఇద్దరూ డబ్బు కోసం తలపడతారు. రవిరాజ్ అనే వాడికోసం రంగా వెతుకుతుంటాడు. ఆ విషయం రవిరాజాకు తెలుస్తుంది. కత్తులు వేస్తూ జీవనం సాగించే రాజారామ్ కొడుకేనా రంగా అన్న అనుమానం రవిరాజ్ కు కలుగుతుంది. రవిరాజ్ పనులకు రంగా అడ్డు తగులుతూ ఉంటాడు. దాంతో అతడిని చంపడానికి బిల్లాను పంపిస్తాడు రవిరాజ్. అప్పుడు రంగా బిల్లాకు, తన గతం వివరిస్తాడు. కత్తులు విసరడంలో రంగా తండ్రి రాజారామ్ కు ఎంతో ప్రావీణ్యం ఉంటుంది. అది చూసిన రవిరాజా అతడిని బెదిరించి ఓ పోలీసాఫీసర్ ను చంపమని చెబుతాడు. రాజారామ్ కావాలనే కత్తులు తప్పుగా విసరుతాడు. దాంతో శబ్ధభేది తెలిసిన రాజారామ్ ను మోసం చేసి, అతని చేతనే ఆయన భార్య చనిపోయేలా చేస్తాడు రవిరాజ్.
తన కన్నవారిని చంపిన రవిరాజ్ ను అంతమొందించి తీరతానని అంటాడు రంగా. ఆ తరువాత బిల్లా తన గతాన్ని వివరిస్తాడు. అతని తండ్రి పేరు విష్ణు. పోలీసాఫీసర్. అతడిని కూడా రవిరాజ్ చంపేసి ఉంటాడు. వాడికోసమే బిల్లా కూడా తిరుగుతూ ఉంటాడు. ఇద్దరి లక్ష్యం రవిరాజ్ ను చంపడమే అని తెలుసుకున్న బిల్లా-రంగా చేతులు కలుపుతారు. బిల్లా ఓ అమ్మాయిని రౌడీల నుండి కాపాడతాడు. ఆమె అతడిలో అన్నయ్యను చూసుకుంటుంది. ఆమెను రంగా పెళ్ళాడతాడు. ఆమెపై మనసుపడ్డ ఒకడు, ఓ నాటకం ఆడి, ఆమె కులట అని సాక్ష్యాలు చూపుతాడు. దాంతో తన బిడ్డను తీసుకొని రంగా వెళ్ళిపోతాడు. ఆ తరువాత విషయం తెలిసిన బిల్లా తన చెల్లెలు నిరపరాధి అని చెబుతాడు. అయినా రంగా వినిపించుకోడు. దాంతో మళ్ళీ రంగాతో తలపడతాడు బిల్లా. వారిద్దరూ ఉంటే తనకు ప్రమాదమని భావించిన రవిరాజ్ తొలుత రంగా,అతని భార్యను బంధిస్తాడు. రంగాను చంపబోతాడు. ఆ లోగా బిల్లా వచ్చి రవిరాజ్ బారి నుండి రంగా కుటుంబాన్ని రక్షిస్తాడు. రవిరాజ్ ను రంగా చంపబోతే, బిల్లా వారిస్తాడు. తాను సి.ఐ.డి ఆఫీసర్ ని అని చెబుతాడు బిల్లా. పోలీసులు రవిరాజ్ ను, అతని ముఠాను అరెస్ట్ చేస్తారు. రంగాను అతని భార్యను బిల్లా కలపడంతో కథ సుఖాంతమవుతుంది.
Read Also: SaiDharam Tej: సత్తా చాటుకున్న సాయిధరమ్ తేజ్!
ఈ సినిమాలో చిరంజీవి తండ్రీకొడుకులుగా, మోహన్ బాబు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం! చిరంజీవికి జోడీగా శ్యామల, మోహన్ బాబుకు జంటగా స్వప్న నటించారు. కన్నడ ప్రభాకర్, త్యాగరాజు, రావి కొండలరావు, కె.కె.శర్మ, ఆనందమోహన్, భీమరాజు, టెలిఫోన్ సత్యనారాయణ, జయమాలిని, పి.ఆర్.వరలక్ష్మి, విజయలిక్ష్మి, కల్పనారాయ్, బేబీ అంజమ్, మాస్టర్ ప్రసాద్ బాబు నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు ఆదుర్తి నరసింహమూర్తి అందించారు. సత్యం సంగీతం సమకూర్చగా వేటూరి, సి.నారాయణ రెడ్డి పాటలు పలికించారు.
ఇందులో “నా పేరు బిల్లా..” అని చిరంజీవి అనగానే, “కుక్కపిల్లా.. అగ్గిపుల్లా..సబ్బు బిల్లలా ఉంది నీ పేరు..” అంటూ మోహన్ బాబు సమాధానం చెప్పిన సీన్ లో జనం కేరింతలు కొట్టారు. “గోల్ మాల్ సాలే..” అనేది ఈ చిత్రంలో మోహన్ బాబుకు ఊతపదం! ఆ మాట కూడా జనాల్లో బాగా నానింది. ఇక ఇందులో చిరంజీవి ఊతపదం “నా పేరు బిల్లా..నేనో ఖిల్లా..” అన్నది.
‘బిల్లా-రంగా’లోని “నా పేరే బిల్లా.. ఇటు రావేమే పిల్లా..”, “కదలిపోయే కావేరీ..”, “ఎదురుగ నీవు.. పదునుగ నేను..”, “పిల్లకి తెస్తా పల్లకి..” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ‘బిల్లా-రంగా’ చిత్రం కమర్షియల్ సక్సెస్ చూసింది.
Read Also: Fact Check: అవునా? 4 జీ, 3 జీ మొబైల్స్ నిలిచిపోతాయా? నిజమెంత..?