తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5కి తెరపడింది. గత ఆదివారం విన్నర్ ని ప్రకటించారు. సన్ని విజేతగా, షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచారు. మూడో స్థానాన్ని మాజీ ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర పొందారు. ఇదిలా ఉంటే ఈ బిగ్ బాస్ సీజన్ 5 అంతా డల్ గా గడిచింది. గత సీజన్స్ తో పోలిస్తే రేటింగ్ లోనూ బాగా వెనుకబడింది. దానికి కారణం అంత ఆసక్తిగా లేకపోవడంతో పాటు పాల్గొన్న వారికి అంతంత ఇమేజ్ ఉండటమే. పోటీదారులను ప్రకటించిన తొలి ఎపిసోడ్ తోనే అందరూ పెదవి విరిచారు. అయితే వేరే ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడంతో పాటు థియేటర్లకు వెళ్ళే సాహసం చేయలేక పోవడం వల్ల బిగ్ బాస్ 5 కి ఈ మాత్రం ఆదరణ అయినా దక్కింది.
ఇక ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేసిన పోటీదారులలో ఎక్కువ మంది ముందుగానే సోషల్ మీడియాలో తమ తమ బృందాలను ఏర్పాటు చేసుకుని బల్క్ ఓటింగ్ చేయించుకున్నారు. దాంతో ఆదరణలో వెనుకబడ్డా ఓటింగ్ శాతం గత సీజన్స్ కంటే పెరిగింది. హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించాడు. విజేతను ప్రకటించే సమయంలో కూడా దాదాపు 12 కోట్ల ఓట్లు పోలయ్యాయని చెప్పడం అందుకు నిదర్శనం. ఓటింగ్ సహజమైన రీతిలో పెరిగితే టిఆర్పీ కూడా పెరగాలి. కానీ టీఆర్పీ తగ్గుతూ ఓటింగ్ పెరిగిందంటేనే అందులో మతలబు అర్థం అవుతోంది.
ఇక విజేత విషయానికి వస్తే ఇటు ప్రజల్లోనూ ఎలిమినేట్ అయి ఫినాలే పాల్గొన్న కంటెస్టెంట్స్ లోనూ ఒకటే ఏకాభిప్రాయం వ్యక్తం అయింది. అందరూ శ్రీరామచంద్రను విజేతగా చూడాలని కోరుకున్నారు. అంటే హౌస్ లో గేమ్ ను జెన్యూన్ గా ఆడి అందరి మనసులు గెలుచుకుంది శ్రీరామచంద్రనే. అయితే అనూహ్యంగా శ్రీరామచంద్ర మూడో ప్లేస్ మాత్రమే దక్కించుకున్నాడు. దానికి కారణం సన్నీ, షణ్ముఖ్ పెయిడ్ ఓటింగ్. వీరిద్దరూ లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి తమ తమ బృందాలతో పోటాపోటీగా ఓట్లను గుద్దించుకున్నారు. దీంతో వారిద్దరే తొలి రెండు స్థానాల్లో నిలిచారు. బిగ్ బాస్ కి కావలసింది కూడా ఓటింగ్ కనుక వేరే దారి లేక వారినే విన్నర్, రన్నర్ గా ఎంపిక చేయవలసి వచ్చింది. నిజానికి ప్రజాభిప్రాయం ప్రకారం అయితే బిగ్ బాస్ 5 విన్నర్ శ్రీరామచంద్రనే. కనీసం వచ్చే సీజన్ నుంచి అయినా బల్క్ అండ్ పెయిడ్ ఓటింగ్ ఉంటే పరిగణనలోకి తీసుకోమని బిగ్ బాస్ ప్రకటిస్తే ఈ షోకి ఆదరణ పెరుగుతుంది. లెట్స్ హోప్ సో.