Shiva Kandukuri: ‘చూసి చూడంగానే’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ ‘గమనం’లోనూ, వెబ్ సీరిస్ ‘మీట్ క్యూట్’లోనూ నటించాడు. అతను హీరోగా నటించిన మరో చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. ఈ సినిమా మార్చి 31న జనం ముందుకు రాబోతోంది. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటించగా, ఇతర ప్రధాన పాత్రలను అరుణ్, దేవీప్రసాద్, వర్షిణి, శివకుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, అంబటి శ్రీను, చైతన్య, వెంకటేశ్ కాకుమాను, ప్రణవి, దివిజ, ప్రభాకర్, కమల్, గురురాజ్ తదితరులు పోషించారు. ఈ మూవీని స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ ను యువ కథానాయకుడు తేజ సజ్జా విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ, ”ఈ సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు. అందుకు మా ప్రొడ్యూసర్స్ కి థాంక్యూ. సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. ఈ షూటింగ్ ఒక పిక్నిక్ లా అనిపించింది” అని అన్నారు. డైరెక్టర్ పురుషోత్తం మాట్లాడుతూ, ”ఈ కథ రాయడానికి మెయిన్ కారణం ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ అన్న. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా అయిపోయాక, డిటెక్టివ్ బాబీ అని ఒక కథ కావాలి అన్నాడు. ఈ విషయం నాకు మా రూమ్మెట్ చెప్పగానే ఒక డిటెక్టివ్ స్టోరీ రెడీ చేశాను. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. మా హీరో శివ కందుకూరి ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. ఆయన ఒక అసోసియేట్ డైరెక్టర్ లా హెల్ప్ చేసాడు” అని అన్నారు.
ప్రొడ్యూసర్ స్నేహాల్ మాట్లాడుతూ, ”హీరో తేజ గారికి, నిర్మాత రాహుల్ యాదవ్ గారికి థాంక్యూ. ఈ పూర్తి స్క్రిప్ట్ ను నాకు డైరెక్టర్ ముందే పంపించాడు. శశిధర్, కార్తీక్, నేను దానిని చదివి మూవీ చేయాలని ఫిక్స్ అయిపోయాం. ఆ తరువాత మేము ఒక టీం ను బిల్డ్ చేసి ఈ సినిమాను పూర్తిచేసాం. డైరెక్టర్ పురుషోత్తం వెరీ టాలెంటెడ్” అని అన్నారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ, ”ఈ రోజు కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ టీజర్ ను బిగ్ స్క్రీన్ పై చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన అందరు మాకు ఒక ఫ్యామిలీ లాంటివారు. మా ప్రొడ్యూసర్స్ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ఔట్పుట్ కోసం చాలా ఖర్చుపెట్టారు. హీరో తేజ సజ్జ, నిర్మాత రాహుల్ యాదవ్, హీరో తిరువీర్ కి కృతజ్ఞతలు. ఇలాంటి సినిమా తెలుగులో రాలేదు. ఒక మంచి సినిమాను మీకు ఇవ్వబోతున్నాం. ఈ సినిమా చూసి మీరొక క్రేజీ ఫీలింగ్ తో బయటకు వస్తారు” అని చెప్పారు. ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియచేసి, సినిమా చక్కని విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇక టీజర్ విషయానికి వస్తే, ఇది మొదటి నుండి చివరివరకు ఆసక్తికరంగా సాగింది. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ఒక సీరియల్ కిల్లర్ ను పట్టుకునే ప్రయత్నంలో డిటెక్టివ్ భాస్కర్ నారాయణ ఏం చేశాడన్నదే చిత్ర కథ. అద్భుతమైన విజువల్స్, ఆసక్తికరమైన నేపథ్య సంగీతంతో టీజర్ ఆకట్టుకుంది. దీనితో సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఏర్పడింది.