ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో లీకుల బాధలు ఎక్కువయ్యాయి. గత 15 రోజుల నుంచి స్టార్ హీరోల సినిమాలు వరుసగా లీకుల బారిన పడుతున్నాయి. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా లీకు రాయుళ్లు ఎవరినీ వదలడం లేదు. మహేష్ బాబు “సర్కారు వారి పాట” టీజర్ ముందుగానే లీక్ కావడంతో మేకర్స్ ఉన్నట్టుండి అర్ధరాత్రి “బ్లాస్టర్”ను రిలీజ్ చేసేశారు. ఇలా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” సాంగ్ “దాక్కో దాక్కో మేక”తో పాటు భారీ ఫైట్ సీక్వెన్స్ కూడా లీకై ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి.
రెండు సినిమాలనూ నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ పరిణామాలతో షాక్ కు గురైంది. దీంతో పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా లీకు రాయుళ్లకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే అవేమి పని చేయలేదు. అంతకన్నా ముందు ప్రభాస్ షూటింగ్ సెట్లో ఉన్న వీడియో, అలాగే పవన్ “భీమ్లా నాయక్”లో ఇద్దరు హీరోల మధ్య ఉండే ఓ ఆసక్తికరమైన సీన్ కూడా అలాగే బయటకు వచ్చేసింది.
Read Also : “బంగార్రాజు” మొదలెట్టేశాడుగా !
తాజాగా పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” నుంచి పోస్టర్ లీకైంది. ఈ పోస్టర్ లో పవన్, రానాను గట్టిగా పట్టుకున్నాడు. ఆ సీన్ ఫైటింగ్ సీన్ అయ్యి ఉండొచ్చు. అయితే మరికొంతమంది మాత్రం ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అంటున్నారు. ఎందుకంటే అందులో రానా లుక్ “నేనే రాజు నేనే మంత్రి”ని, పవన్ కళ్యాణ్ లుక్ “కాటమరాయుడు” సినిమాలను పోలి ఉంది. ఏదైతేనేం ఈ పోస్టర్ లీకైంది అనే వార్త, పోస్టర్ రెండూ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. “భీమ్లా నాయక్” టీజర్ విడుదల సందర్భంగా మూవీని పవన్ సినిమా చేసేశారని, రానాకు అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అసలు సినిమాలో ఆయన ఉన్నాడా ? లేడా ? అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని నెటిజన్లు విమర్శించారు. దీంతో చిత్ర నిర్మాత స్పందిస్తూ రానాకు సంబంధించి స్పెషల్ అప్డేట్స్ ఉంటాయని చెప్పి వారిని కూల్ చేశాడు.
ఈ నేపథ్యంలో “భీమ్లా నాయక్” పోస్టర్ లీక్ అంటూ వస్తున్న వార్తలు టాలీవుడ్ ను కలవర పెడుతున్నాయి. మరి పెద్ద తలనొప్పిగా మారిన ఈ లీకుల సమస్య తీరే మార్గమే లేదా ? అనేది ప్రశ్నార్ధంకంగానే మిగిలింది.
ఇక “భీమ్లా నాయక్” త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన స్క్రీన్ ప్లేతో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియుమ్”కు రీమేక్ ఇది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12 న విడుదల కానుంది.