పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సోమవారం జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా ఫిబ్రవరి 23కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక జరగనుంది. పవన్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఈవెంట్ కు అభిమానులు భారీగా తరలిరానున్నారు. అయితే ఇంతకుముందు ఇదే వేదికగా ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన మిస్టేక్స్ కు “భీమ్లా నాయక్” ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. పాస్ లు తదితర బాధ్యతలను పోలీసులకే అప్పగించారు.
Read Also : Bheemla Nayak : ట్రైలర్ పై రామ్ చరణ్ రివ్యూ
అల్లు అర్జున్ “పుష్ప” ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో పాస్‌లు జారీ చేయడంతో ఆ రోజు పెద్ద రచ్చ జరిగింది. ఆంక్షల కారణంగా వేలాది మంది అభిమానులు ఈవెంట్ కు రాలేకపోయారు. 5000 మంది కూర్చునే వేదిక కోసం పది వేల పాస్‌లు జారీ చేశారని చాలామంది మండిపడ్డారు. కొంతమంది గాయపడ్డారు కూడా. ఇలాంటి అనూహ్య సంఘటనలు జరగకుండా ‘భీమ్లా నాయక్’ మేకర్స్ పోలీసులకు పాస్‌లు జారీ చేసే బాధ్యతను ఇచ్చేశారు. సోమవారం ఈవెంట్ కోసం ప్రొడక్షన్ హౌస్ జారీ చేసిన పాస్‌లు ఈరోజు ఈవెంట్‌కి చెల్లవు. తాజా పాస్ లను పోలీసులే స్వయంగా జారీ చేస్తారు. ఈ ఈవెంట్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ యూట్యూబ్ తో పాటు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కాబోతున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న “భీమ్లా నాయక్”ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.