75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మూవీకి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. మలయాళచిత్రం ‘అయ్యప్పనుమ్ ఖోషియుమ్’ కు ఇది తెలుగు రీమేక్. అక్కడ అయ్యప్పన్ నాయర్ గా బిజూ మీనన్ నటిస్తే, కోషి కురియన్ పాత్రను పృధ్వీరాజ్ చేశాడు. ఇక్కడ అవే పాత్రలను పవన్ కళ్యాణ్, రానా చేస్తున్నారు. అక్కడ మాదిరి ఇద్దరి పాత్రల పేర్లను టైటిల్ కు ఉపయోగించకుండా కేవలం పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ‘భీమ్లా నాయక్’ను మాత్రమే తెలుగు రీమేక్ కు పెట్టడం విశేషం. దాంతోనే ఇందులో పైచేయి ఆ ఇద్దరిలో పవన్ కళ్యాణ్ ది అనేది అర్థమైపోతోంది. విశేషం ఏమంటే… ఈ గ్లిమ్స్ ఇలా విడుదలైందో లేదో అలా సోషల్ మీడియాలో వైడ్ ఫైర్ మాదిరి విజృంభించేస్తోంది. గంట గంటలకూ లైక్స్ వేలల్లో పెరిగిపోతున్నాయి.
మలయాళ చిత్రంలో ఎస్. ఐ. అయ్యప్పన్ నాయర్ గిరిజన మహిళను పెళ్ళి చేసుకుంటాడు. ఇందులో పవన్ కళ్యాణే గిరిజన యువకుడిగా నటించాడు. అతని భార్యగా నిత్యా మీనన్ నటిస్తోంది. అయితే తాజాగా విడుదలైన 52 సెకన్ల గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ ఫెరోషియస్ యాక్షన్ విజువల్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తున్న రానా కనిపించకుండా, అతని వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. తన పేరును తెలియచేస్తూ ‘డానీ… డానియల్ శేఖర్’ అంటూ రానా చెబుతాడు. అలానే అతని భార్యగా నటిస్తున్న ఐశ్వర్య రాజేశ్ కూడా ఈ గ్లిమ్స్ లో కనిపించలేదు.
ఈ గ్లిమ్స్ లో ప్రధానంగా రెండు అంశాలు హైలైట్ అయ్యాయి. ఒకటి… పవన్ కళ్యాణ్ యాక్షన్… రెండు ఎస్. ఎస్. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్! గ్లిమ్స్ ప్రారంభం కావడమే ‘లాలా…. భీమ్లా… అడవి పులి… గొడవ పడి… ఒడిసిపట్టు… పంచెకట్టు…’ అంటూ సాగుతుంది. సినిమాలోని ప్రధానాంశమే ఎస్.ఐ. అండ్ రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్స్ మధ్య ఇగో క్లాష్… ఆ గొడవ చినికి చినికి గాలీవానగా మారిపోయి… వాళ్ళ జీవితాలను తారుమారు చేస్తుంది. ఈ గ్లిమ్స్ లోనూ ఆ గొడవనే డైరెక్టర్ సాగర్ కె చంద్ర హైలైట్ చేశాడు. ‘వకీల్ సాబ్’ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం సమకూర్చే ఛాన్స్ రావడంతో… థమన్ రెచ్చిపోయాడు. నూరుశాతం ఎఫెర్ట్ ను పెట్టాడు. అది ఈ గ్లిమ్స్ రీ-రికార్డింగ్ లో కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ లుంగీని పైకి కట్టి… ‘ఓరేయ్ డానీ… బయటకు రారా నా కొడకా’ అంటూ డానియల్ శేఖర్ ఉండే ప్రాంతానికి వెళ్ళి అతని మనుషులను చితకొట్టడం చూస్తే… గూజ్ బంబ్స్ ఖాయం. దానికి తోడు ‘డానీ… డానియల్ శేఖర్’ అని అవతల గొంతు వినిపించగానే ‘భీమ్లా… భీమ్లా నాయక్’ అంటూ పవన్ సమాధానం ఇస్తాడు. ఈ మూవీకి స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఆయన మాటల్లోని చమక్ సైతం ఈ గ్లిమ్స్ లో కనిపిస్తోంది… ‘ఏంటి చూస్తున్నావ్… కింద కాప్షన్ లేదనా… అక్కర్లేదు బండెక్కు’ అనే డైలాగ్ కరెక్ట్ గా మూవీ టైటిల్ పడగానే రావడం… భలే సింక్ అయ్యింది. ఇది త్రివిక్రమ్ తాలుకూ మ్యాజిక్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ పాటను సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఇక వచ్చే సంక్రాంతి కానుకగా ‘భీమ్లా నాయక్’ను వరల్డ్ వైడ్ జనవరి 12న విడుదల చేయబోతున్నారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
మెగాభిమానులు ఆనందించే మరో విషయం ఏమంటే… 2013లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ‘నాయక్’ పేరుతో ఓ మూవీ చేశాడు. అది సూపర్ డూపర్ హిట్. ఆ సినిమా సంక్రాతి కానుకగానే విడుదలైంది. ఆ చిత్రానికి కూడా ఎస్. ఎస్. థమన్ సంగీతం అందించడం విశేషం. సో… అప్పుడు అబ్బాయి ‘నాయక్’ గా వస్తే ఇప్పుడు బాబాయి ‘భీమ్లా నాయక్’గా సంక్రాంతి బరిలో దిగబోతున్నాడు.