యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. 1970లో యూరప్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాను ‘ప్రభాస్ 20’ పేరుతో 2018 సెప్టెంబర్ 5న ప్రారంభించారు. సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఇంకా విడుదల కాలేదు. ఒకానొక సమయంలో ప్రభాస్ అభిమానులు సినిమా ఇంకెంతకాలం తీస్తారంటూ మేకర్స్ పై సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. మరికొంత మంది సెటైర్లు పేల్చారు. ఏదైతేనేం మొత్తానికి సినిమా పూర్తి కావచ్చింది. అయితే ఒక రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని చెప్పి, సినిమా షూటింగ్ ను మరీ సినిమాను అంతలా సాగదీయడం, “సాహో” సినిమాకు కూడా ఇలాగే జరగడంతో ‘రాధేశ్యామ్’ ఎఫెక్ట్ తగ్గడం మొదలైంది. సినిమాను తక్కువ అంచనా వేసిన మిగతా సినిమాల మేకర్స్ ఈ పాన్ ఇండియా సినిమాకు పోటీగా తమ సినిమాలను విడుదల చేయడానికి ధైర్యంగా ముందడుగు వేశారు. అలా “రాధేశ్యామ్”ను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నాము అని ప్రకటించగానే ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాల విడుదల తేదీలు కూడా ప్రకటించేశారు.
‘రాధేశ్యామ్’ టీజర్ ఎఫెక్ట్
అయితే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజున టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న “రాధేశ్యామ్” టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సునామీని సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా యూనిక్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లో ప్రభాస్ లుక్, డైలాగ్స్, సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటేమిటి అన్నీ అద్భుతః అన్నట్టుగా ఉన్నాయి. ఇక ‘రాధేశ్యామ్’ ఇప్పటి వరకు ఉన్న చాలా రికార్డులను బ్రేక్ చేసింది. టీజర్ తోనే ‘రాధేశ్యామ్’ సృష్టించిన తుఫానుకు మిగతా హీరోలకు గుబులు పట్టుకున్నట్టుగా కన్పిస్తోంది.
తాజా సమాచారం మేరకు ‘రాధేశ్యామ్’ దూకుడు చూసిన పవన్, మహేష్ తమ సినిమాలను వాయిదా వేసుకోబోతున్నారని తెలుస్తోంది. “భీమ్లా నాయక్” జనవరి 12న, “సర్కారు వారి పాట” జనవరి 13న విడుదల కానున్నాయని అధికారికంగా ప్రకటించారు. కానీ ‘రాధేశ్యామ్’ టీజర్ ను, దాని ఎఫెక్ట్ ను చూశాక తమ నిర్ణయాన్ని మార్చుకునే పనిలో పడ్డారట ఆ రెండు సినిమాల మేకర్స్.
మహేష్, పవన్ సినిమాలు వాయిదా ?
ఈ మేరకు “భీమ్లా నాయక్” నిర్మాతలు కొన్ని తేదీలను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం జనవరి 26 విడుదల కావాల్సి ఉండగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 1న విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రకటన వెలువడే అవకాశం ఉందట. “భీమ్లా నాయక్” షూటింగ్ నవంబర్ నాటికి పూర్తవుతుంది. ఇక “సర్కారు వారి పాట” 2022 వేసవిలో విడుదల కానుంది. ఏప్రిల్ 28న ఈ సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ ఆలోచిస్తున్నారట. “సర్కారు వారి పాట” షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుంది. ఏదేమైనా లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి స్టార్ హీరోల్లో గుబులు రేపి, వెనక్కి తగ్గేలా చేశాడు “రాధేశ్యామ్”.
