Bedurulanka 2012: ఆర్ఎక్స్ 100 తరువాత కుర్ర హీరో కార్తికేయకు అంతటి విజయాన్ని అందించిన చిత్రం ఒక్కటి కూడా లేదు. అప్పటి నుంచి ఈ హీరో దండయాత్ర చేస్తూనే ఉన్నాడు కానీ విజయాన్ని మాత్రం అనుకోలేకపోతున్నాడు. మధ్యలో విలన్ గా కనిపించినా అది కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో మనోడు హీరోగానే కంటిన్యూ అవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఇక ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్న చిత్రం బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తికేయ సరసన డీజే టిల్లు భామ నేహా శెట్టి నటిస్తోంది. 2012 యుగాంతం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. 2012 యుగాంతం రోజు బెదురులంక అనే గ్రామంలో ప్రజలు ఏం చేశారు అనేది ఈ టీజర్ లో చూపించారు. ఎవరి నమ్మకాన్ని బట్టి వారు దేవుళ్లను పూజించడం, ఇష్టమైన వంటకాలను చేసుకొని అందరు కలిసి ఆరగించడం, ఒక చిన్న శబ్దం వచ్చిన ఉలిక్కిపడడం లాంటి సీన్స్ ఎంతో ఉత్కంఠను రేపుతున్నాయి. ఇక వీరి మధ్యలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ చూపించి మరింత ఆసక్తిని రేకెత్తించారు. టోటల్ గా కథను రివీల్ చేయకపోయినా ఈసారి కార్తికేయ ఇంట్రెస్టింగ్ కథతోనే రాబోతున్నట్లు ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించడం ప్లస్ పాయింట్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా కార్తికేయ హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.