‘ఆర్ఆర్ఆర్’ సందడి సద్దుమణుగుతోంది. ‘కెజిఎఫ్-2’ హీట్ మొదలైంది. ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయబోతోంది. ఇక దీనికి పోటీగా ఓ రోజు ముందు ‘బీస్ట్’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో దేనికి ఆదరణ దక్కుతుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్. వరుస విజయాలతో కోలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుగున్న విజయ్ ‘బీస్ట్’లో హీరో కాగా, లక్కీ బ్యూటీ కన్నడ కస్తూరి పూజా హెగ్డే కథానాయిక. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇది అతడికి మూడో చిత్రం. తొలి సినిమా ‘కొలమావు కోకిల’, రెండో సినిమా ‘డాక్టర్’ రెండూ హిట్. ఇప్పుడు విజయ్ తో ‘బీస్ట్’ మూడోది. దీని తర్వాత రజనీకాంత్ తో సినిమా కమిట్ అయిఉన్నాడు. ఇక ‘బీస్ట్’కి అనిరుద్ సంగీతం పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పటికే ‘అరబిక్ కుత్తు’, ‘జాలీ ఓ జిమ్ కానా’ పాటలు జనం నోళ్ళలో నానుతున్నాయి. అయితే ట్రైలర్ విషయంలో మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకు కారణం లేకపోలేదు. 14న వస్తున్న ‘కెజిఎఫ్-2’ ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్. దాంతో ‘బీస్ట్’ ట్రైలర్ ని కూడా యాక్షన్ పార్ట్ తో నింపేశారు. నిజానికి సినిమా ఫుల్ ఎంటర్ టైనర్ అని వినికిడి.
ఇక ‘కెజిఎఫ్-2’ విషయానికి వస్తే ట్రైలర్ ప్రకారం చూస్తే తొలి భాగానికి రిప్లికాలాగా కనిపిస్తోంది తప్ప కొత్తదనం కనిపించ లేదు. ఎంటర్ టైన్ మెంట్ కూడా లేదు. పాటలు కూడా ‘బీస్ట్’తో పోలిస్తే వీక్. సినిమాలో కంటెంట్ ఏమిటన్నది ముఖ్య అంశం. దీని దర్శకుడు ప్రశాంత్ నీల్ కి కూడా ఇది మూడో సినిమా. తొలి సినిమా ‘ఉగ్రమ్’తో పాటు రెండో సినిమా ‘కె.జి.ఎఫ్-1’ రెండూ బ్లాక్ బస్టర్స్. ‘కె.జి.ఎఫ్-2’ మూడోది. దీని విషయానికి వస్తే గరుడను చంపిన తర్వాత రాకీభాయ్ ఏం చేస్తాడన్నది ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. దీనిని ఎంత చక్కగా మలిచారన్న దానిమీద సక్సెస్ ఆధారపడి ఉంటుంది. రెండు సినిమాలూ ఇద్దరు దర్శకులకు హ్యాట్రిక్ సినిమాలే. ఈ సినిమాల క్రేజ్ ఎంతలా ఉందంటే, ఈ పాన్ ఇండియా మూవీస్ కారణంగా షహీద్ కపూర్ హిందీ మూవీ ‘జెర్సీ’ ఓ వారం వెనక్కి వెళ్ళింది. ప్రశాంత్ నీల్ సైతం ‘కెజిఎఫ్-2’ తర్వాత ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా ‘సలార్’ చేస్తున్నాడు. ప్రచారంలోనూ, ఆసక్తిపరంగాను ప్రస్తుతానికి ‘బీస్ట్’ కంటే ‘కెజిఎఫ్-2’దే పై చేయిగా ఉంది. మరి ఈ రెండు సినిమాల విడుదల తర్వాత ఈ లెక్కలు తారుమారు అవుతాయా!? లేక రెండూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయా? లేదా రెండూ నిరాశ పరుస్తాయా? అన్నది తేలాల్సి ఉంది.
