వెండితెరపై బ్యాట్ మేన్
కథలు కళకళలాడం కొత్తేమీ కాదు. 1943లో లూయిస్ విల్సన్ బ్యాట్ మేన్ గా నటించిన సీరియల్ తొలిసారి జనానికి వినోదం పంచింది. తరువాత బ్యాట్ మేన్ గా రాబర్ట్ లోవరీ నటించిన బ్యాట్ మేన్ అండ్ రాబిన్
కూడా 15 ఎపిసోడ్స్ సీరియల్ గానే అలరించింది. ఆ తరువాత 1966లో బ్యాట్ మేన్
సినిమాగా జనం ముందు నిలచింది. ఇందులో ఆడమ్ వెస్ట్ బ్యాట్ మేన్ పాత్రలో మురిపించారు. అదే సంవత్సరం మళ్ళీ బ్యాట్ మేన్
సీరియల్ ప్రేక్షకులను పరవశింప చేసింది. ఇలా బ్యాట్ మేన్
కామిక్స్ ఆబాలగోపాలాన్నీ అలరిస్తూ వచ్చాయి. ఆ తరువాత 1989లో మళ్ళీ బ్యాట్ మేన్
వెండితెరపై వెలిగింది. అప్పటి నుంచీ వరుసగా బ్యాట్ మేన్ రిటర్న్స్, బ్యాట్ మేన్ ఫరెవర్, బ్యాట్ మేన్ అండ్ రాబిన్
వంటి చిత్రాలు 1990లలో వెలుగు చూశాయి. తరువాత బ్యాట్ మేన్: ఇయర్ ఒన్ అండ్ బ్యాట్ మేన్ బియాండ్
అనే సినిమా, ఆ పై బ్యాట్ మేన్ వర్సెస్ సూపర్ మేన్
వంటి చిత్రాలలోనూ బ్యాట్ మేన్ కథ సాగింది.
మళ్ళీ 2005లో బ్యాట్ మేన్ బిగిన్స్
వచ్చింది. ఆ తరువాత దాని సీక్వెల్స్ గా ద డార్క్ నైట్, ద డార్క్ నైట్ రైజెస్
వంటి బ్యాట్ మేన్ ఆధారిత కథలూ అలరించాయి. బ్యాట్ మేన్ కథల్లోని పాత్రల ద్వారా కూడా జోకర్
వంటి కొన్ని సినిమాలు రూపొందడం విశేషం. ఆపై బ్యాట్ గర్ల్
కూడా సందడి చేసింది. ఇంతలా బ్యాట్ మేన్ కథలు ఎన్ని వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆదరణ లభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే బ్యాట్ మేన్
కు మళ్ళీ ఓ కొత్త కళ తెచ్చేందుకు అన్నట్టు తాజాగా మరో బ్యాట్ మేన్
రూపొందింది. ఈ సారి బ్యాట్ మేన్ గా రాబర్ట్ ప్యాటిన్సన్ నటించాడు. ట్విలైట్, టెనెట్
వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించిన రాబర్ట్ ప్యాటిన్సన్ కు యువతలో విశేషమైన క్రేజ్ నెలకొంది. నిజానికి బెన్ అఫ్లెక్ ను తాజా బ్యాట్ మేన్ లో నటించమని కోరారు నిర్మాతలు. అయితే, అతను అంగీకరించక పోవడంతో రాబర్ట్ ప్యాటిన్సన్ ను అదృష్టం వరించింది.
రాబర్ట్ నటించిన బ్యాట్ మేన్
మార్చి 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్ కు రాబర్ట్ హాజరవుతున్నాడు. ఎక్కడ చూసినా, అప్పుడే బ్యాట్ మేన్
సీక్వెల్ ఎలా ఉంటుందనే ప్రశ్నలు వినిపించడం విశేషం. జనం సినిమా చూడక ముందే సీక్వెల్ గురించి అడుగుతున్నారంటే, ప్రేక్షకుల్లో బ్యాట్ మేన్
పాత్రకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో వచ్చిన బ్యాట్ మేన్
సీరిస్ కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుందని, నవతరం ప్రేక్షకులు కోరుకొనే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉండబోతున్నాయని రాబర్ట్ చెబుతున్నాడు. జనాల్లో ఎంతో క్రేజ్ ఉన్న బ్యాట్ మేన్ పాత్రలో తాను నటించడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉందని అంటున్న రాబర్ట్ ఈ సినిమా ఎండింగ్ అనూహ్యంగా ఉంటుందని, దాని నుంచే సీక్వెల్ కు లైన్ సాగుతుందని అంటున్నాడు. ఇప్పటికే ఎంతోమంది మేటి నటులు ప్రాణం పోసిన బ్యాట్ మేన్ పాత్రకు రాబర్ట్ ప్యాటిన్సన్ ఏ తీరున జీవం పోశాడో చూడాలని జనం ఆసక్తిగా ఉన్నారు. మార్చి 4న కొత్త బ్యాట్ మేన్
గా రాబర్ట్ జేజేలు అందుకుంటాడో లేదో తేలిపోతుంది.