‘అన్ స్టాపపబుల్ టాక్ షో’తో నందమూరి బాలకృష్ణ పైన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బాలయ్య అంటే కోపం ఎక్కువ, ఫాన్స్ ని కొడతాడు అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు బాలయ్య అంటే ఫన్, ఎనర్జీ, జోష్ అనే మాటలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన ‘అన్ స్టాపపబుల్ షో’లో బాలయ్యని చూసిన వాళ్లు హోస్ట్ గా దుమ్ము లేపుతున్నాడు అనకుండా ఉండలేరు. ఇండియాలోనే బెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ‘అన్ స్టాపపబుల్’ సీజన్ 1 ని ముగించుకోని సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. సీజన్ మారింది కానీ బాలయ్యలో ఎలాంటి మార్పు లేదు, అదే అల్లరి అదే ఎనర్జీ. ఇంకా చెప్పాలంటే సీజన్ 1 కన్నా సీజన్ 2లో బాలయ్య ఫన్ డోస్ ని మరింత పెంచాడు. ఇప్పటికే ఈ సీజన్ 2లో నాలుగు ఎపిసోడ్స్ బయటకి వచ్చి, నాలుగు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. కాస్త సైలెంట్ గా కనిపించే శేష్, శర్వానంద్ లాంటి వాళ్లతోనే నవ్వులు పూయించాడు అంటే బాలయ్య మ్యాజిక్ ఎంతలా వర్కౌట్ అవుతుందో అర్ధం చేసుకోవచ్చు.
లాస్ట్ ఎపిసోడ్ లో తన ఫ్రెండ్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన బాలయ్య, ఈ వారం విడుదల కానున్న 5వ ఎపిసోడ్ లో లెజెండ్స్ తో ఫన్ చేయనున్నాడు. దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు, గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, హిట్ అనే పదానికే విసుగొచ్చే రేంజులో హిట్స్ ఇచ్చిన దర్శకుడు కోదండరామి రెడ్డి లాంటి లెజెండ్స్ నెక్స్ట్ వీక్ లో సందడి చేయనున్నారు. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో బాలయ్య 13 సినిమాలు చేయగా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏడు సినిమాలు చేశాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కూడా బాలయ్య రెండు సినిమాలు నటించాడు. అయితే ఈ గెస్టులలో అల్లు అరవింద్ తో బాలకృష్ణ ఇప్పటివరకూ సినిమా అయితే చేయలేదు కానీ త్వరలో ఒక సినిమా అనౌన్స్ అయ్యే అవకాశం ఉందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి తెలుగు సినిమా చరిత్రలో తమకంటూ ప్రత్యేకమైన పేజిలని రాసుకున్న ఈ నలుగురు లెజెండ్స్ బాలయ్యతో కలిసి ఎంత సందడి చేశారో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీక్ వరకూ ఆగాల్సిందే.