“అఖండ” భారీ విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ‘అఖండ’ హీరో బాలకృష్ణ సినిమా దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డితో కలిసి తాజాగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య ఆన్లైన్ టిక్కెటింగ్ జీవోను రద్దు చేస్తూ ఏపీ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై స్పందించారు.
Read also : దుర్గమ్మ సేవలో బాలయ్య… ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు
బాలయ్య ఆన్లైన్ టిక్కెటింగ్ విధానంపై మాట్లాడుతూ “ఆ రోజు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, ‘అఖండ’ టీం, మేము చాలా చర్చించుకున్నాము. టికెటింగ్ విధానం ఉన్నప్పటికీ సినిమా బాగుందన్న ధైర్యంతో ధైర్యంగా ముందుకు వెళ్ళాము. ఈరోజు ఏపీ హైకోర్ట్ ఆ జీవోను రద్దు చేసినప్పటికీ ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ కు వెళ్తుంది. అది అలాగే నడుస్తుంది. అన్నింటికీ ప్రిపేర్ అయ్యి , సినిమా మీద, ప్రేక్షకుల మీద నమ్మకంతో, అమ్మవారి ఆశీస్సులతో సినిమాను విడుదల చేశాము. ప్రేక్షకులు సినిమాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో… వాళ్లొస్తే మేము వస్తాం అంటూ మేకర్స్ వెనుకా ముందు అవుతున్న తరుణంలో మేము ధైర్యం చేసి ముందుకు వచ్చాము. ఆ దేవుడు న్యాయనిర్ణేత. ఒక్కొక్క శబ్దంలో ఒక పవర్ ఉంటుంది. దేవుడు కరోనా నుంచి కాపాడుతున్నాడు. అలాగే ప్రేక్షక దేవుళ్ళు సినిమాకు ‘అఖండ’ విజయం అందించారు. వారికి ధన్యవాదాలు” తెలిపారు.
చిత్రపరిశ్రమ తరపున తమవంతు కృషిగా ఏం చేయదలచుకున్నారు ? అనే ప్రశ్నకు సమాధానంగా “నేనూ టికెట్ రేట్ల గురించి మాట్లాడాను. నా ప్రయత్నం నేను చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుంది ? అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇప్పుడు హైకోర్ట్ ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వం మళ్ళీ అప్పీల్ కు వెళ్తుంది. ముందుముందు ఏం జరుగుతుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాము. ఇప్పుడు సినిమా కాపాడింది… మేము సినిమా ఇండస్ట్రీని కాపాడతాం” అంటూ చెప్పకొచ్చారు బాలయ్య.
