Prasanna Kumar: టాలీవుడ్‌లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!

Prasanna Kumar

Prasanna Kumar

Prasanna Kumar: టాలీవుడ్‌లో ఇటీవల డాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, ఫెడరేషన్ మధ్య చోటుచేసుకున్న వివాదానికి ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ఒక ఇంటిలో చిన్న చిన్న గొడవలు అవి అన్ని ఈరోజు పరిష్కారం అయ్యాయి. డాన్సర్స్ అసోసియేషన్ అందరూ కలసి కట్టుగా ముందుకు వెళ్తారు. బాలకృష్ణ గారు ప్రత్యేకించి ఈ సమస్య పరిష్కారం కోసం మాతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. బాలకృష్ణ గారు కాకినాడ నుంచి కాల్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాతావరణం ఉండకూడదని, సమస్యను పరిష్కరించమని చెప్పినట్లు వెల్లడించారు. ఆయన సూచనల మేరకు పరిశ్రమ పెద్దలు, సంఘాల ప్రతినిధులు కలిసి చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించినట్లు చెప్పారు. డాన్సర్స్ ఇరువర్గాలు చాలా మంచి వారే, ఎంతో కష్టపడి పనిచేస్తారు, ఇంతటితో ఈ సమస్య పరిష్కారం అయ్యిందని చెప్పారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానంగా డాన్సర్స్, ఫైటర్స్ యూనియన్లలో అమలవుతున్న “షేరింగ్ రేషియో” విధానంపై చాలా కాలంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో షూటింగ్ జరిగితే నిర్మాతలు తమ అవసరానికి అనుగుణంగా స్థానిక డాన్సర్లు, ఫైటర్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండాలని, ఇద్దరు కోఆర్డినేటర్ల వ్యవస్థ నిర్మాతలకు అదనపు భారంగా మారుతోందని పేర్కొన్నారు. అందుకే ఇకపై ఒకే కోఆర్డినేటర్ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కార్మికుల పేరుతో నిధులను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిపారు. నిజమైన కార్మికుల హక్కులు వారికి అందేలా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే నిర్మాత కూడా పరిశ్రమలో తొలి కార్మికుడేనని, అతని ప్రయోజనాలను కాపాడుతూ కార్మికులకు న్యాయం జరిగేలా వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఫెడరేషన్‌కు, జానీ మాస్టర్‌కు సంబంధించిన అంశంలో చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎవరి నైపుణ్యాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని కూడా ఆయన వివరించారు. పరిశ్రమలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు అన్ని సంఘాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ వివాదంలో ఎవరూ గెలవలేదని, ఎవరూ ఓడిపోలేదని, ఇది ఒక కుటుంబంలో జరిగే చిన్న అపార్థంలాంటిదేనని పేర్కొంటూ, ఇకపై పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, నిర్మాతల ప్రయోజనాల కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.