ప్రఖ్యాత రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు నామినేట్ కావడం, సాక్షాత్తు దేశప్రధాని నరేంద్రమోడీ అభినందించడం ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఎంతోమందికి ఆనందం కలిగిస్తోంది. ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ పేరు దేశవిదేశాల్లోని సినీజనంలో మారుమోగిపోతున్న విషయం విదితమే! `బాహుబలి` సిరీస్ తో రచయితగా విజయేంద్రప్రసాద్ యావద్భారతంతో పాటు, విదేశాలలోనూ గుర్తింపు సంపాదించారు. ఇక సల్మాన్ ఖాన్ `బజరంగీ భాయిజాన్`, కంగనా రనౌత్ `మణికర్ణిక` చిత్రాలతో బాలీవుడ్ లోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారాయన. తెలుగునాట ట్రెండ్ సెట్టర్ గా నిలచిన `సమరసింహారెడ్డి` కథకుడిగా ఆయన జేజేలు అందుకున్నారు. ఆయన కలం నుండి జాలువారిన కథలతో రూపొందిన `సింహాద్రి, యమదొంగ, మగధీర, బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కంక్లూజన్“ చిత్రాలు సాధించిన విజయాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. తమిళంలో ఆయన రచనతోనే రూపొందిన విజయ్ `మెర్సల్` సైతం అక్కడి జనాలకు ఆయన కలం బలం తెలిపింది.
విజయేంద్రప్రసాద్ దర్శకుడిగానూ కొన్ని ప్రయోగాలు చేశారు. తన అన్న శివశక్తిదత్తతో కలసి `అర్ధాంగి` అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ముందుగా కీరవాణి కంపోజ్ చేసిన బాణీలకు పాటలు రాయించి, ఆ పాటల ఆధారంగా ఓ కథను తయారు చేసి దానినే `అర్ధాంగి`గా రూపొందించడం అప్పట్లో చర్చనీయాంశమయింది. శ్రీకాంత్ హీరోగా `శ్రీకృష్ణ 2006`, నాగార్జునతో `రాజన్న`, వైవిధ్యంగా తెరకెక్కించిన `శ్రీవల్లి`లో కూడా ఆయన ప్రయోగాలు చేశారు. అయితే ఇప్పటి దాకా దర్శకునిగా సరైన సక్సెస్ అయితే విజయేంద్రప్రసాద్ దరి చేరలేదు. ఏది ఏమైనా రచయితగా విజయేంద్రప్రసాద్ విశేషఖ్యాతిని ఆర్జించారు. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం లభించడం పట్ల తెలుగు చిత్రసీమలో సర్వత్రా ఆనందం వెల్లి విరుస్తోంది. మరి `బాహుబలి` రచయితగా విశేషమైన పేరు సంపాదించిన విజయేంద్రప్రసాద్ రాజ్యసభలోనూ తన బాణీ, వాణీ వినిపిస్తారని ఆశిద్దాం.