Archana Birthday Special :
నలుపు నారాయణుడు మెచ్చు అంటారు. నలుపుతోనూ చిత్రసీమలో గెలుపు సాధించవచ్చుననీ కొందరు నిరూపించారు. నలుపున్నా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా గెలుపు చూసిన మేటి నటి అర్చన. ఎలా ఉంటేనేం? అర్చన అభినయంలో ఓ అందం ఉండేది. ఆ చూపుతోనే బంధాలు వేసే శక్తీ ఆమె సొంతం! వాటిని మించి సుగంధాల వాసనలాంటి లావణ్యం అర్చనలో తిష్టవేసుకుంది. ఇన్ని లక్షణాలున్న తరువాత నలుపు, తెలుపుతో పనేంటి!? అర్చనను ‘బ్లాక్ బ్యూటీ’ అంటూ ఎందరో కీర్తించారు. వరుసగా రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచి, విమర్శకుల మదినీ గెలిచారు. ఇక జనం మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అర్చన చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఎన్నో ఏళ్ళ తరువాత నవతరం దర్శకుడు జీవన్ రెడ్డి తన ‘చోర్ బజార్’ సినిమాలో అర్చన మాత్రమే న్యాయం చేయగల పాత్రలో అమెను నటింపచేశారు. పూరి ఆకాశ్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ యేడాదే జనం ముందు నిలచింది. ఆ నాటి అర్చన అభిమానులకు ఓ మధురానుభూతిని సొంతం చేసింది.
అర్చన అసలు పేరు సుధ. పుట్టింది విజయవాడలో. బాల్యంలోనే అర్చన కుటుంబం మద్రాసు చేరింది. నల్లగా, పీలగా ఉన్నా అర్చనలో ఏదో ఆకర్షించే అందం ఉందని గమనించారు సినీజనం. ‘తాయ్ పొంగల్’ అనే తమిళ చిత్రంలో తొలిసారి నటించిన అర్చన, తరువాత భారతీరాజా ‘కాదల్ ఓవియమ్’లో ఓ చిన్న పాత్రతోనే మంచి గుర్తింపు సంపాదించారు. మాతృభాష తెలుగులో ‘మధురగీతం’ అనే చిత్రంలో తొలిసారి నటించారు అర్చన. బాలు మహేంద్ర తెలుగులో తెరకెక్కించిన ‘నిరీక్షణ’లో అర్చన అందం అయస్కాంతంలా కుర్రకారును ఆకర్షించింది. వంశీ ‘లేడీస్ టైలర్’లో నిండుగా చీరకట్టుకొని కవ్వించింది అర్చన అందం. “ఉక్కు సంకెళ్ళు, దాసి, యోగివేమన, మట్టి మనుషులు, భారత్ బంద్, చక్రవ్యూహం, పచ్చతోరణం, పోలీస్ వెంకటస్వామి” వంటి సినిమాల్లో అర్చన నటించారు. వీటిలో “లేడీస్ టైలర్, భారత్ బంద్” మంచి విజయం చూశాయి. ఎన్ని చిత్రాల్లో నటించినా, ఈ నాటికీ ఆ నాటి కుర్రకారు అర్చన పేరు వినగానే ‘నిరీక్షణ’ సినిమానే గుర్తు చేసుకుంటారు.
తమిళ, మళయాళ భాషల్లోనూ అర్చన తనదైన బాణీ పలికించారు. కమర్షియల్ మూవీస్ లో కంటే ఆఫ్ బీట్ సినిమాల్లోనే అర్చన ఎక్కువగా నటించారు. తన పర్సనాలిటీకి ఆ పాత్రలే నప్పుతాయని ఆమె చెప్పేవారు. 1987లో బాలు మహేంద్ర తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వీడు’లో ‘నిరీక్షణ’ జోడీ – అర్చన, భానుచందర్ నటించారు. ఆ సినిమా ద్వారా అర్చనకు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు లభించింది. ఆ మరుసటి సంవత్సరమే బి.నరసింగరావు రూపొందించిన ‘దాసి’ తెలుగు చిత్రం ద్వారా కూడా ఆమెకు మరో నేషనల్ అవార్డు దక్కింది. నటిగా తనదైన బాణీ కొన్ని చిత్రాలలోనే ప్రదర్శించగలిగారు అర్చన. అయితేనేం, జనం మరచిపోలేని నటనతో వారి మదిలో చెదరని స్థానం సంపాదించారామె. తరువాత ఏ తెలుగు చిత్రంలో అర్చన నటిస్తుందో చూడాలని అభిమానులు ఆశగా చూస్తున్నారు. ‘చోర్ బజార్’లో అమితాబ్ బచ్చన్ అభిమానిగా అభినయించి అలరించిన అర్చన భవిష్యత్ లోనూ వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటారని ఆశిద్దాం.