ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ రెహ్మాన్ చాలా సంతోషంగా ఉన్నాడు. దీనికి కారణం అతడి కుమార్తె ఖతీజా వివాహం. గతనెలలో ఖతీజా రెహ్మాన్ ప్రముఖ ఆడియో ఇంజనీర్, బిజినెస్ మెన్ రియాస్‌దీన్ షేక్ మహమ్మద్‌ను వివాహం చేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన ఈ వెడ్డింగ్‌కు పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా చెన్నైలోనే వెడ్డింగ్ రిసెప్షన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా హాజరయ్యారు.
అంతేకాకుండా ప్రముఖ నటుడు ప్రభు, మణిరత్నం, ఉదిత్ నారాయణ్, జావేద్ అలీ, సోనూ నిగమ్ లాంటి వాళ్లు కూడా హాజరై రెహ్మాన్ కుమార్తె ఖతీజా దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహ్మాన్ మంగళవారం నాడు భావోద్వేగ లేఖ రాశాడు. ఈ వేడుకకు వచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు. అటు ఈ వేడుక ఘనంగా జరిగేందుకు సహకరించిన తిరువళ్లూరు జిల్లా పోలీస్ అధికారులకు, చెన్నై ట్రాఫిక్ పోలీసులకు, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్, ఫైర్ రెస్క్యూ డిపార్టుమెంట్, ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులకు రెహ్మాన్ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశాడు. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాసలు పడుతూ తన కుమార్తె వెడ్డింగ్ రిసెప్షన్‌కు వచ్చిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పాడు. తనపై అందరి ప్రేమాభిమానాలు ఇలాగే కొనసాగాలని ఏఆర్ రెహ్మాన్ ఆకాంక్షించాడు. కాగా ఖతీజా రెహ్మాన్ కూడా సింగర్‌గా రాణిస్తోంది. కృతి సనన్ ప్రధాన పాత్రలో రూపొందిన మిమీ చిత్రంలోని రాక్ ఏ బై బేబీ అనే పాతను ఖతీజానే ఆలపించి మార్కులు కొట్టేసింది.