స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందించటం ఎంతో కష్టమని ఎంతో మంది సంగీతదర్శకులు చెబుతూ వస్తుంటారు. తాజాగా ఆ జాబితాలో ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ కూడా చేరారు. స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్లు ట్యూన్స్ ఇవ్వవలసి రావటం ఎంతో వత్తిడితో కూడిన వ్యవహారం అంటుంటారు. రెహమాన్ కూడా రజనీకాంత్ చిత్రాలకు పనిచేయటం నరకమే అని చెబుతున్నాడు. రజనీకాంత్ నటించిన ‘ముత్తు, నరసింహా, బాబా, శివాజీ: ది బాస్, ఎంథిరన్, కొచ్చడయ్యాన్, లింగా, 2.0’ చిత్రాలకు రెహమాన్ సంగీతం అందించారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పరిమితమైన గడువు వల్ల పని భారం పెరిగి రజనీ చిత్రాలకు పనిచేసిన అనుభవం నరకం అనిపించేదని అన్నాడు. ఇప్పుడు చాలా మేలు. అప్పట్లో రజనీకాంత్ సినిమాలు ఎక్కువగా దీపావళికి విడుదల అవుతుండేవి. దాంతో ఆ సినిమాల పని మార్చిలో ప్రారంభించేవాడిని. మా ప్లేస్ లో కరెంట్ కోత ఉండేది. రెండు
జనరేటర్లు ఉన్నా…. అది నరకాన్ని తలపింప చేసేది అని చెప్పారు. రజనీకి మాస్ లోఉన్న ఇమేజ్ కారణంగా ఆ చిత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వవలసి వచ్చేది. దాంతో నాతో పని చేస్తున్న ఇతర దర్శకులను ఆగ్రహానికి కూడా గురైన సందర్భాలున్నాయి. ఇక పండగలన్నా కూడా నాకు విరక్తి కలిగేది. ఎందుకంటే పలువురు తమ తమ సినిమాలు కూడా దీపావళి, దసరా, న్యూయర్, పొంగల్ రిలీజ్ అనేవారు. అందుకే నాకు పండగలంటే ఇష్టం లేకుండా
పోయింది. అవి నా ఆనందాన్ని దూరం చేసేవి అందుకే అంటున్నారు రెహమాన్. రెహమాన్ ఆరు జాతీయ అవార్డులతో పాటు, రెండు అకాడమీ అవార్డులను సైతం గెలుచుకున్నారు. ఇక ప్రాంతీయ, ఇతర సంస్థల అవార్దులకు లెక్కే లేదు.