Virupaksha: మార్చి నెలలో ఏకంగా 34 సినిమాలు విడుదలైతే, ఈ నెలలో ఎగ్జామ్స్ ఫీవర్ కారణంగా ఆ ఊపు తగ్గింది. అనువాద చిత్రాలతో కలిపి 19 సినిమాలే ఏప్రిల్ లో రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ ఫస్ట్ వీకెండ్ 7వ తేదీ వచ్చిన మాస్ మహరాజా రవితేజ ‘రావణాసుర’, కిరణ్ అబ్బవరం ‘మీటర్’ చిత్రాలు ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ‘ధమాకా, ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ‘రావణాసుర’తో రవితేజ హాట్రిక్ అందుకుంటాడని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న నటుడు సుశాంత్ కూ చేదు అనుభవమే దక్కింది. ఫిబ్రవరిలో వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’తో కిరణ్ అబ్బవరం ఫర్వాలేదని పించుకున్నాడు. కానీ ఆ ఆనందాన్ని ‘మీటర్’ పరాజయం మింగేసింది. ఈ సినిమా మరీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. అదే రోజున వచ్చిన ఆంగ్ల అనువాద చిత్రం ‘ది పోప్స్: ఎక్సార్సిస్ట్’ కూడా ఏ విధంగానూ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఈ నెల సెకండ్ వీకెండ్ లో రెండు డబ్బింగ్ సినిమాలతో కలిపి ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో ‘ఓ కల’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక భారీ అంచనాలతో 14వ తేదీ విడుదలైన పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ బాక్సాఫీస్ బరిలో డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను త్రీడీలో కూడా రూపొందించడంతో అభిమానులు టెక్నికల్ గా ఈ సినిమా కొత్త అనుభూతులను అందిస్తుందని ఆశపడ్డారు. కానీ టూ డీతో పోల్చితే త్రీ డీ వర్షన్ పరమ దారుణంగా ఉందనే విమర్శలు వచ్చాయి. అలానే లారెన్స్ అనువాద చిత్రం ‘రుద్రుడు’ సైతం పాత వాసనలు కొట్టి, ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అదే రోజున వచ్చిన హెబ్బా పటేల్ ‘బ్లాక్ అండ్ వైట్’ చిత్రం, 15వ తేదీ వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా ‘విడుదల -1’ ఎలాంటి ప్రభావం చూపించలేక పోయాయి.
ఏప్రిల్ నెలలో చిత్రసీమకు ఊపిరిని పోసిన సినిమాగా ‘విరూపాక్ష’ నిలిచింది. సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో సుకుమార్ తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పెద్దంత అంచనాలు లేకుండా వచ్చిన ‘విరూపాక్ష’ ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. సంయుక్తా మీనన్ నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. ఇది రొటీన్ రివేంజ్ డ్రామానే అయినా…. తెరకెక్కించిన విధానం, నిర్మాణ విలువలు ఈ మూవీని విజయపథంలోకి తీసుకెళ్ళాయి. ఐదు భాషల్లో విడుదల కావాల్సిన ‘విరూపాక్ష’ను తొలుత తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ అది సక్సెస్ కావడంతో ఇప్పుడు మే 5న తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. మొదటి ఎనిమిది రోజుల్లో ఒక్క తెలుగు భాషలోనే రూ. 65 కోట్ల గ్రాస్ ను ‘విరూపాక్ష’ మూవీ వసూలు చేసింది. ఇక ఈ సినిమాతో ఆ వారం మరో ఐదు స్ట్రయిట్ తెలుగు సినిమాలు, ఆంగ్ల అనువాద చిత్రం ‘ఈవిల్ డెడ్ రైజ్’ వచ్చాయి. కానీ ఏవీ ప్రేక్షకులను మెప్పించలేదు.
ఏప్రిల్ లాస్ట్ వీకెండ్ లో ఓ అనువాద చిత్రంతో పాటు మూడు స్ట్రయిట్ సినిమాలు వచ్చాయి. అందులో అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న ‘ఏజెంట్’ మూవీ ప్రధానమైంది. గత ఆరేడు నెలలుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను ఎట్టకేలకు ఏప్రిల్ 28న రిలీజ్ చేశారు. దీని కోసం సిక్స్ ప్యాక్ చేసిన అఖిల్ శ్రమంతా వృధా అయ్యింది. స్టోరీ మాత్రమే కాదు స్క్రీన్ ప్లే కూడా డల్ గా ఉండటంతో అక్కినేని అభిమానులు సైతం ‘ఏజెంట్’ ని చూసి పెదవి విరుస్తున్నారు. అఖిల్ కు పరాజయాలు కొత్తేమీ కాదు కానీ ఈ మధ్య కాలంలో అతని సినిమాల్లో ఇంత దారుణమైన బ్యాడ్ టాక్ మరే సినిమాకూ రాలేదు. ‘ఏజెంట్’ రిలీజ్ రోజునే ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తమిళ అనువాద చిత్రం ‘పి.ఎస్. -2’ జనం ముందుకు వచ్చింది. రాజరాజ చోళుడి కథతో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ సీక్వెల్ తమిళులను అలరించినట్టుగా తెలుగువారిని ఆకట్టుకోవడం కష్టమే. చిత్రం ఏమంటే ఈ నెలలో సింగిల్ ఫిమెల్ క్యారెక్టర్ తో రూపుదిద్దుకున్న ‘హలో మీరా (గార్గేయి యల్లాప్రగడ), రా… రా… పెనిమిటి (నందితా శ్వేత) సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఈ ప్రయోగాత్మక చిత్రాలు ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించలేక పోయాయి. మొత్తం మీద ఏప్రిల్ లో ఐదు అనువాద చిత్రాలు, పద్నాలుగు స్ట్రయిట్ సినిమాలు విడుదల కాగా కేవలం ‘విరూపాక్ష’ మాత్రమే విజయాన్ని సాధించింది.