NTV Telugu Site icon

రివ్యూ: అంతఃపురం (తమిళ డబ్బింగ్)

anthapuram

anthapuram

నటి ఖుష్బూ భర్త సుందర్ సి. కి తమిళనాట దర్శకుడిగా మంచి పేరుంది. ‘అరుణాచలం’ వంటి వినోదభరిత చిత్రాలతో పాటు, ‘సత్యమే శివం’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీస్ కూడా సుందర్ సి తీశాడు. అయితే… గత కొంతకాలంగా సరైన విజయాన్ని సాధించని సుందర్… సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కాలని అనుకుంటున్న ప్రతిసారీ హారర్ జానర్ ను ఆశ్రయిస్తున్నాడు. అలా 2014లో ‘అరణ్మనై’ పేరుతో ఓ సినిమా తీశాడు. అది ‘చంద్రకళ’గా తెలుగులో డబ్ అయ్యింది. ఆ తర్వాత రెండేళ్ళకు ‘అరణ్మనై-2’ చేశాడు. అది ‘కళావతి’గా తెలుగులో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం కోసం ‘అరణ్మనై-3’ని తీశాడు. దీపావళి కానుకగా తమిళనాట విడుదలైన ఈ సినిమా డిసెంబర్ 31న తెలుగు వారి ముందుకు ‘అంతఃపురం’గా వచ్చింది.

రాజశేఖర్ (సంపత్ రాజ్) ఓ జమిందారు. అతని భార్య ఈశ్వరి (ఆండ్రియా) మరణించిన తర్వాత కూతురు జ్యోతి (రాశిఖన్నా)కి అన్నీ తానై పెంచుతాడు. తమ భవంతిలో ఏదో దెయ్యం ఉందని జ్యోతి చెప్పిన మాటలను విశ్వసించని రాజశేఖర్, ఆమెను బోర్డింగ్ స్కూల్ కు పంపేస్తాడు. తన అక్క సరళ (నళిని), చెల్లి మైనావతి (మైనా నందిని), బావమరిది శివమణి (వివేక్), అక్క కూతురు హేమ (సాక్షి అగర్వాల్), ఆమె భర్త రవి (సుందర్ సి), వాళ్ళ పాపతో కలిసి ఆ అంతఃపురంలోనే నివసిస్తుంటాడు. పద్దెనిమిదేళ్ళ తర్వాత చదువు పూర్తి చేసుకుని జ్యోతి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఆ భవంతిలోని దెయ్యం జ్యోతిని చంపబోతుంది. లక్కీగా ఆమె ఆ ప్రమాదం నుండి బయటపడుతుంది. అలానే రవి కూతురుని కూడా దెయ్యం భయపెడుతుంది. ఆమెను రవి కాపాడతాడు. భార్యకు తన కూతురు బాధ్యతను అప్పగించి, విదేశాలకు వెళ్ళిపోవాలనుకున్న రవి… ఈ ఘటనతో తన నిర్ణయం మార్చుకుంటాడు. భూతవైద్యుల సాయంతో ఈ భవంతిలోని దెయ్యాల పనిపట్టాలని అనుకుంటాడు. ఆ భవంతిలో తిరుగుతున్న ఆత్మలు ఎవరివి? వాటికి అక్కడేం పని? జ్యోతితో పాటు ఆ ఇంటిలోని చిన్నపిల్లను అవి ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? అనేది మిగతా కథ.

దర్శకుడు సుందర్ సి ఇలాంటి హారర్ జోనర్స్ తెరకెక్కించడంలో పండిపోయాడు. అందుకే పెద్దంత కష్టపడకుండా ఈ సినిమాను తీసేశాడు. నిజానికి ఇందులో కష్టమంతా ఇతర టెక్నీషియన్లదే! పరమ రొటీన్ గా సాగే ఈ కథలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలేవీ లేవు. ఈ హారర్ కామెడీ సినిమాలో ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాలు కానీ, కడుపుబ్బ నవ్వించే వినోదం కానీ లేవు. ‘అరణ్మనై’లో సంతానంతో కామెడీ చేయించిన సుందర్, ఆ తర్వాత ‘అరణ్మనై -2’కు సూరిని రంగంలోకి దించాడు. ఇప్పుడీ మూడో భాగానికి యోగిబాబు, వివేక్ లతో కామెడీ చేయించాడు. వీరితో మనోబాల కూడా చేతులు కలిపాడు కానీ ఎక్కడా వారి హాస్యం పండలేదు. అలానే సినిమా మొత్తం మీద ఒకటి రెండు సీన్స్ మినహా మిగిలినవి ఏవీ ప్రేక్షకులను బెదరగొట్టవు. అయితే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, సి. సత్య నేపథ్యం సంగీతం బాగానే ఉన్నాయి. అలానే వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగుంది. సత్య స్వరపరిచిన వాటిలో రోలింగ్ టైటిల్స్ లో వచ్చే టైటిల్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. భారీ సెట్ లో ఈ కలర్ ఫుల్ సాంగ్ ను పిక్చరైజ్ చేశారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే పాట, అందులో గాయకులు హరిహరన్, శంకర్ మహదేవన్ కనిపించడం ఈ మూవీకి సంబంధించిన ఓ హైలైట్. సినిమా మొత్తంలోనూ చెప్పుకోదగిన అంశం ఏదైనా ఉందంటే ఇదే!

ఇక నటీనటుల విషయానికి వస్తే… ఇందులో ఎవరూ ఏమంత పెద్దగా కష్టపడినట్టు అనిపించదు. పాత్రలన్నీ చాలా ఫ్లాట్ గా సాగిపోతాయి. రాజశేఖర్ గా నెగెటివ్ షేడ్స్ ఉండే పాత్రను సంపత్ రాజ్ చేశాడు. దర్శకనిర్మాత, రచయిత సుందర్ సి. ఇందులో కీలకమైన పాత్ర పోషించాడు. గతంలోనూ సుందర్ కొన్ని సినిమాలలో నటించినా, ఇందులో అతని నటన గొప్పగా ఏం లేదు. జస్ట్ ఓకే. ఇక రాశీఖన్నా తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె నటనకు ఉన్న స్కోప్ తక్కువ. ఆమె కంటే ఓ రకంగా తల్లిగా నటించిన ఆండ్రియాకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. పైగా సినిమా కథ మొత్తానికీ మూలమైన పాత్ర ఆమెదే. తనకు, తన కూతురుకు జరిగిన అన్యాయానికి ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే ఇందులోని ప్రధానాంశం. ఆ రకంగా చూస్తే ఆండ్రియాకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర దక్కినట్టే. దాన్ని ఆమె సమర్థవంతంగా పోషించింది. ఇక ఆర్య ఇందులో జ్యోతి ప్రేమికుడిగానే కాకుండా డిఫరెంట్‌ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడు. అయితే అతని పాత్రకు ప్రథమార్థంలోనూ, క్లయిమాక్స్ లోనూ మాత్రమే చోటు దక్కింది. ఆత్మలను అదుపు చేసే భూతవైద్యుని పాత్రను తెలుగు నటుడు మధుసూదన్ పోషించాడు. కోరిక తీరని వ్యక్తుల ఆత్మలు అశాంతితో రగిలిపోవడం, తమ చావుకు, తమ వారి చావుకు కారణమైన వ్యక్తులపై పగ తీర్చుకోవడం మామూలే. ఇది కూడా అలా ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే కొన్ని ఆత్మలకు సంబంధించిన కథే. అయితే వాటి ఫ్లాష్ బ్యాక్ కాస్తంత ఆసక్తికరంగా ఉంది. రాశిఖన్నా, ఆండ్రియా అభిమానులకు, హారర్ కామెడీ చిత్రాలను ఇష్టపడేవారికి ‘అంతఃపురం’ కొంతలో కొంత నచ్చే ఆస్కారం ఉంది.

ప్లస్ పాయింట్స్
అలరించే కెమెరా, నేపథ్య సంగీతం
ఆకట్టుకునే విఎఫ్ఎక్స్

మైనెస్ పాయింట్స్
మెప్పించని నటీనటుల నటన
కొత్తదనం లేని కథ, కథనం
పేలవమైన వినోదం

రేటింగ్ : 2.5 /5

ట్యాగ్‌ లైన్: నో హారర్, నో హ్యూమర్!