తెలుగు సినీ జగత్తు లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) 101వ జయంతి సందర్భంగా అభిమానులకు ప్రత్యేక బహుమతి సిద్ధమైంది. ఆయన నటించిన సూపర్‌హిట్ క్లాసిక్ చిత్రాలు డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం మళ్లీ పెద్ద తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా, ఈ సినిమాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన థియేటర్లలో అది కూడా ఉచిత టిక్కెట్లతో ప్రదర్శించనున్నారు. ఇది నిజంగా అభిమానుల్లో విశేష ఆనందాన్ని కలిగిస్తోంది.
Also Read : Fauji : ప్రభాస్ ఫౌజీ మూవీతో.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో
ఈ రెండు ప్రసిద్ధ చిత్రాలు సెప్టెంబర్ 20 నుంచి మళ్లీ రీ-రిలీజ్ అవుతున్నాయి. పెద్ద తెరపై ఏఎన్ఆర్ మాయాజాలాన్ని మళ్లీ ఆస్వాదించే అరుదైన అవకాశం ఇది. ముఖ్యంగా, ఆయన నటనతో మంత్రముగ్ధులైన సీనియర్ సిటిజన్లు, కుటుంబాలు తమ జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకునే లా చేస్తుంది. ఈ ప్రత్యేక ప్రదర్శనలకు టిక్కెట్లు బుక్ మై షో లో సెప్టెంబర్ 18 నుంచి.. అంటే ఈ రోజు నుండే ఉచిత రిజర్వేషన్ కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలు వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ థియేటర్లలో ప్రదర్శనలు జరగనున్నాయి. వీటిలో వైజాగ్‌లో క్రాంతి థియేటర్, ఒంగోలులో స్వర్ణ ప్యాలెస్, విజయవాడలో కృష్ణ టాకీస్, అలాగే హైదరాబాద్‌లోని ఒక ప్రసిద్ధ థియేటర్ కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కేంద్రాలను జోడించే అవకాశం ఉందని సమాచారం.
ఏఎన్ఆర్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆయన నటన, సిల్వర్ స్క్రీన్‌పై సృష్టించిన మాయాజాలాన్ని అభిమానులు మరోసారి ఆస్వాదించనున్నారు. అభిమానులు తమ తమ నగరాల్లోని థియేటర్లకు వెళ్లి, కుటుంబసభ్యులతో కలిసి ఈ క్లాసిక్ సినిమాలను చూసి ఆనందించాలని పిలుపునిచ్చారు.